Uttar Pradesh: ఆలయ వైఫైని దుర్వినియోగం చేసిన కొడుకు.. పూజారిపై కేసు పెట్టిన పోలీసులు!
- ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ఘటన
- అమ్మాయి ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసిన కొడుకు
- తండ్రీకొడుకులపై కేసు నమోదుచేసిన పోలీసులు
కొడుకు చేసిన నిర్వాకానికి తండ్రి బలయ్యాడు. ఓ అమ్మాయి అశ్లీల ఫొటోలు మార్ఫింగ్ చేసిన వ్యవహారంలో యువకుడితో పాటు అతని తండ్రిపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో చోటుచేసుకుంది.
ఆగ్రా నగరంలోని ఓ ఆలయంలో ప్రధాన పూజారిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి మందిరంలో వైఫై కనెక్షన్ ఏర్పాటు చేశాడు. ఈ కనెక్షన్ ను తన పేరిట తీసుకున్నాడు. అయితే ఈ పాస్ వర్డ్ ను తెలుసుకున్న పూజారి కుమారుడు(15) ఇటీవల పిక్నిక్ కు వెళ్లాడు. ఈ సందర్భంగా క్లాస్ మేట్ అమ్మాయి ఫొటోలను తీశాడు. వాటిని ఆలయం వైఫై సాయంతో అశ్లీలంగా మార్ఫింగ్ చేశాడు. అనంతరం నకిలీ ఇన్ స్టాగ్రాం అకౌంట్ తెరిచి వాటిని అప్ లోడ్ చేశారు.
ఈ ఫొటోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొట్టడంతో సంబంధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో విచారణ ప్రారంభించిన పోలీసులు ఆలయం వైఫై నుంచి ఈ ఫొటోలు అప్ లోడ్ చేసినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆలయ పూజారితో పాటు ఆయన కుమారుడిపై పోలీసులు కేసు నమోదుచేశారు.