Agri Gold: ఏలూరు జైలు నుంచి విడుదలైన అగ్రిగోల్డ్ నిందితుడు!
- ఇప్పటికే విడుదలైన 12 మంది
- 17 కేసుల్లో అకౌంటెంట్‌కు బెయిలు మంజూరు
- టీడీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న కన్నా
అగ్రిగోల్డ్ నిందితుల్లో ఒకరైన ఆ సంస్థ సీనియర్ అకౌంటెంట్ కె.సుందర్‌కుమార్ బుధవారం జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ కేసులో పోలీసులు మొత్తం 25 మందిని నిందితులుగా చేర్చారు. 17 మందిని అరెస్ట్ చేయగా, 12 మంది ఇప్పటికే బెయిలుపై బయటకు వచ్చారు. తాజాగా ఏలూరు జైలులో ఉన్న అకౌంటెంట్ సుందర్‌కుమార్‌కు బెయిలు లభించింది. మొత్తం 17 కేసుల్లో అతడికి బెయిలు మంజూరు కావడంతో అధికారులు అతడిని విడుదల చేశారు. అగ్రిగోల్డ్‌పై ఒడిశాలోనూ కేసులు నమోదయ్యాయి. అయితే, సుందర్‌కుమార్‌పై అక్కడ ఎటువంటి కేసులు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.
రాష్ట్రంలో ప్రస్తుతం అగ్రిగోల్డ్ వ్యవహారం అధికార, విపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి తీసుకొచ్చింది. అగ్రిగోల్డ్ ఆస్తుల విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆ సంస్థ ఆస్తులను తక్కువ విలువకు కొట్టేయాలని మంత్రి లోకేశ్ ప్రయత్నిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ విమర్శలకు టీడీపీ కూడా కౌంటర్లు ఇస్తూ కన్నాను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది.