Vizag: విశాఖలో ఐటీ దాడులు మొదలు... నేతలు, వ్యాపారవేత్తల్లో టెన్షన్ టెన్షన్!
- ఎంవీపీ కాలనీలోని ఐటీ కార్యాలయం ముందు 50కి పైగా వాహనాలు
- దువ్వాడలో ఉన్న ఎస్ఈజెడ్ లో మొదలైన సోదాలు
- టీజీఐ కంపెనీలో తనిఖీలు చేస్తున్న ఐటీ అధికారులు
నవ్యాంధ్రకు ఐటీ రాజధానిగా ఎదుగుతున్న విశాఖపట్నానికి నిన్న భారీగా చేరుకున్న ఐటీ అధికారులు ఈ ఉదయం తమ పనిని ప్రారంభించారు. స్థానిక ఎంవీపీ కాలనీలోని ఐటీ కార్యాలయం ముందు భారీ సంఖ్యలో వాహనాలు బారులుతీరి ఉండగా, కొన్ని వాహనాలు ఉద్యోగులతో కలసి దాడులకు వెళ్లిపోయాయి. దాదాపు 50కి పైగా వాహనాలు ఉద్యోగులను తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేయబడ్డాయి.
ఇప్పటికే గాజువాక మండలం దువ్వాడలో ఉన్న ఎస్ఈజెడ్ లోని పలు కంపెనీల్లో ఐటీ దాడులు ప్రారంభమయ్యాయి. టీజీఐ కంపెనీకి చేరుకున్న 8 మంది అధికారుల బృందం తనిఖీలు చేస్తోంది. ట్రాన్స్ వాల్ట్ బీచ్ శాండ్ కంపెనీలోకి కొందరు అధికారులు వెళ్లారు. ఆక్వా కంపెనీలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ప్రముఖులు, స్టార్ హోటల్ యజమానుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరగవచ్చని తెలుస్తోంది. ఐటీ అధికారులు భారీగా చేరుకోవడంతో అధికారపక్ష నేతలు, వ్యాపారవేత్తల్లో టెన్షన్ నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆత్రుత సర్వత్ర నెలకొంది. మరోపక్క, వీటిని కవర్ చేయడానికి మీడియా వాహనాలు ఐటీ ఆఫీస్ ముందు బారులు తీరాయి.