MLAs: దినకరన్ వర్గంలో 21 మంది ఎమ్మెల్యేలు... టెన్షన్ తో అత్యవసర సమావేశం నిర్వహిస్తున్న పళనిస్వామి!
- ఎమ్మెల్యేల అనర్హతపై నేడు తీర్పు
- తన వర్గంతో ప్రత్యేకంగా సమావేశమైన పళనిస్వామి
- తీర్పు వ్యతిరేకంగా వస్తే మైనారిటీలో ప్రభుత్వం
అన్నాడీఎంకేకు చెందిన 18 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటుపై నేడు కోర్టు తీర్పు వెల్లడికానున్న నేపథ్యంలో, తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. శశికళ బంధువైన టీటీవీ దినకరన్, తన వర్గం ఎమ్మెల్యేలను ఇప్పటికే రిసార్టుకు తరలించగా, ఆయన వర్గంలో 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేల అనర్హతపై కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే, పళనిస్వామి ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితి ఉండటంతో, ఈ ఉదయం తన వర్గం నేతలు, మంత్రులతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందన్న చర్చ ఈ సమావేశంలో సాగింది. ఒకవేళ, కోర్టు తీర్పు అనుకూలంగా రాకపోతే ప్రభుత్వాన్ని నిలుపుకునేందుకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలేంటన్న విషయంపైనా వీరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
కాగా, తమిళనాడు అసెంబ్లీలో 235 (234 మంది ఎమ్మెల్యేలు, ఒకరు నామినేటెడ్) మంది ఎమ్మెల్యేలుండగా, ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంది. ప్రస్తుతం రెండు స్థానాలు ఖాళీగా ఉండటంతో 116 మంది ఎమ్మెల్యేల బలంతో బొటాబొటి మెజారిటీతో అన్నాడీఎంకే పాలన సాగిస్తోంది. మరో 18 మంది ఎమ్మెల్యేలు అనర్హులుగా ఉండగా, వారి కేసులోనే నేడు తీర్పు రానుంది. ఇక విపక్ష పార్టీలైన డీఎంకేకు 88 మంది, కాంగ్రెస్ కు 8 మంది, ఐయూఎంఎల్ కు ఒకరు, స్వతంత్రులు ఒకరు ఉన్నారు. ఈ సమయంలో అనర్హత వేటుపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే, పళని సర్కారు మైనారిటీలో పడిపోతుంది. అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవడంలో పళని విఫలమైతే, ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంది.