serial thefts: అమ్మో... ఈ వదినామరదళ్లు సామాన్యులు కారు!
- రద్దీ కూడళ్లలో ఒంటరిగా వెళ్తున్న మహిళలే లక్ష్యం
- అదను చూసుకుని విలువైన వస్తువుల అపహరణ
- పోలీసుల నిఘాతో చిక్కిన వైనం
ఇద్దరూ వదినా మరదళ్లు. చదువు కోలేదు. వారి భర్తల అంతంత మాత్రం ఆదాయంతో కుటుంబమే గడవడం కష్టంగా ఉంది. కానీ విలాసవంతంగా జీవించాలని తప్పుడు మార్గం ఎంచుకున్నారు. చిన్నపిల్లల్ని చంకన వేసుకుని రద్దీగా ఉన్న కూడళ్లలో తిరుగుతూ, వచ్చీపోయే వారి నుంచి విలువైన బంగారు ఆభరణాలతో కూడిన సంచులను, పర్సులను కాజేయడం మొదలుపెట్టారు.
ఈ క్రమంలో ఇప్పటికే ఐదుసార్లు జైలుకు వెళ్లి వచ్చినా వీరు తమ పంథా మార్చుకోలేదు. ఇప్పటి వరకు వీరిని చిల్లర నేరగాళ్లే అనుకున్న పోలీసులు బుధవారం గుంటూరు గౌరీశంకర్ థియేటర్ వద్ద వీరిని పట్టుకుని విచారించగా, వెలుగు చూసిన వాస్తవాలతో కంగుతిన్నారు. రూ.5.95 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
గుంటూరు కొత్తపేట డీఎస్పీ శ్రీనివాసులు తెలిపిన వివరాలు ఇవీ... తూర్పుగోదావరి జిల్లా కాటారు గ్రామానికి చెందిన నక్కా మంగ అలియాస్ గండికోట వెంకటలక్ష్మి (ప్రస్తుతం ఈమె దుగ్గిరాల మండలం తుమ్మపూడి కాలువ కట్ట వద్ద ఉంటోంది), విజయవాడ రామవరప్పాడు రైల్వేస్టేషన్ సమీపంలో నివసించే గండికోట భవాని అలియాస్ మరియమ్ము వదినా మరదళ్లు. వీరు రద్దీ కూడళ్లలో తిరుగుతూ దీనంగా యాచిస్తుంటారు. అదే సమయంలో విలువైన వస్తువులతో వెళ్తున్న వారిపై ఓ కన్నేసి, మాటల్లో పెట్టి వారిని బోల్తా కొట్టిస్తారు. సొత్తుతో మాయమవుతారు. కొత్తపేట వడ్డూరి వారి వీధి సాయిబాబా గుడివద్ద జూలై 27న ఓ మహిళ 70 గ్రాముల బంగారం పోగొట్టుకుంది.
ఆగస్టు 25న ఎన్టీఆర్ బస్టాండ్ వద్ద ఓ మహిళ చేతి సంచిలోని 40 గ్రాముల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. సెప్టెంబరు 5న నరసరావుపేట బస్టాండ్ వద్ద మరో మహిళ సంచిలో 24 గ్రాముల బంగారు ఆభరణాలు, పదో తేదీన నరసరావుపేట పువ్వాడ ఆస్పత్రి వద్ద మహిళ సంచి నుంచి రెండు బంగారు ఉంగరాలు, నల్లపూసల తాడు మాయమయ్యాయి. అలాగే, సెప్టెంబరు 12న గుంటూరు లలితా సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి వద్ద ఓ మహిళ పర్సు నుంచి 24 గ్రాముల బంగారు ఆభరణాలు, 20న ఎన్టీఆర్ బస్టాండ్ వద్ద మహిళ పర్సులోని లక్ష్మీదేవి లాకెట్‌తో ఉన్న బంగారు హారం, 22న కొత్తపేట మారుతీ ఆస్పత్రి వద్ద మహిళ నుంచి 20 గ్రాముల నల్లపూసల గొలుసు చోరీ జరిగాయి.
ఈ దొంగతనాలన్నీ ఒకేలా ఉండడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆస్పత్రులు, బస్టాండ్లు, దేవాలయాలు, సినిమా థియేటర్ల వద్ద నిఘా పెట్టారు. గౌరీశంకర్ థియేటర్ సమీపంలోని ఓ ఆస్పత్రి వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఈ వదినామరదళ్లు కనిపించడంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగుచూసింది. ఇటీవల జరిగిన వరుస దొంగతనాలన్నింటికీ తామే పాల్పడ్డామని చెప్పడంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతయింది. వీరి నుంచి సోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు.