Savji Dolakia: ఈసారి 600 మందికి కార్లు, ఫిక్సెడ్ డిపాజిట్లు, ఖరీదైన ఫ్లాట్లు... ఉద్యోగులకు భారీ కానుకలు ప్రకటించిన సూరత్ వజ్రాల వ్యాపారి!
- ప్రతి యేటా దీపావళికి విలువైన బహుమతులు
- ఈ సంవత్సరం ముగ్గురికి బెంజ్ కార్లు కూడా
- పెద్ద మనసు చాటుకున్న సావ్జి దోలాకియా
సూరత్ కు చెందిన వజ్రాల వ్యాపారి, హరికృష్ణ డైమండ్స్ ఎక్స్ పోర్ట్స్ అధినేత సావ్జి దోలాకియా, మరోసారి ఉద్యోగుల పట్ల తన పెద్ద మనసును చాటుకున్నారు. ప్రతి సంవత్సరం దీపావళికి తన వద్ద పనిచేసే ఉద్యోగులకు లాభాల్లో వాటాలు ఇస్తూ, భారీ కానుకలను ప్రకటించి వార్తల్లో నిలిచే ఆయన, ఈ సంవత్సరమూ అదే పని చేసుకున్నారు. తన సంస్థలో పని చేస్తున్నవారికి ఈ సంవత్సరం మారుతి సుజుకి ఆల్టో, సెలెరియా, ఫిక్సెడ్ డిపాజిట్లు, ఖరీదైన ఫ్లాట్లను ఆయన కానుకలుగా ఇవ్వనున్నారు.
సంస్థను నమ్మి సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారికి, అనుభవాన్ని బట్టి ఏటా దోలాకియా కానుకలు ఇస్తారన్న సంగతి తెలిసిందే. మొత్తం 1,600 మందిని కానుకలకు ఎంపిక చేసిన ఆయన, కారు, ఫిక్సెడ్ డిపాజిట్లలో ఏది కావాలో కోరుకోవాలని వారికే అవకాశాన్ని ఇచ్చారు. 25 సంవత్సరాల సర్వీస్ దాటిన వాళ్లకు రూ. 3 కోట్ల విలువైన బెంజ్ కార్లను బహుమతిగా ప్రకటించారు. మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 600 మంది కార్లను సెలక్ట్ చేసుకున్నారు. వీరిలో ఇద్దరు మహిళా ఉద్యోగులకు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా కారు తాళం చెవులను ఇప్పటికే ఇప్పించారు దోలాకియా.
కాగా, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం దోలాకియా ప్రకటించిన బహుమతుల విలువ కాస్తంత తక్కువేనని తెలుస్తోంది. 1977లో టికెట్ డబ్బులతో సూరత్ చేరుకున్న ఆయన, వజ్రాల వ్యాపారిగా ఎదిగి, రూ. 6 వేల కోట్ల టర్నోవర్ సాధించే స్థాయికి కంపెనీని విస్తరించారు.