minister atchanaidu: ఇవన్నీ టీడీపీ ప్రభుత్వంపై బురదజల్లేందుకు జరుగుతున్న కుట్రలు: మంత్రి అచ్చెన్నాయుడు
- జగన్ కు నిందితుడు శ్రీనివాస్ వీరాభిమాని
- వైసీపీ నేతలు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారు
- ఇదంతా ‘ఆపరేషన్ గరుడ’లో భాగమే
వైఎస్ జగన్ పై దాడికి పాల్పడిన వ్యక్తి ఆయనకు వీరాభిమాని అని, జగన్ తో అతను ఉన్న నిలువెత్తు కటౌట్లు కూడా ఉన్నాయని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ కు నిందితుడు శ్రీనివాస్ వీరాభిమాని అన్న విషయం ఆయన కుటుంబసభ్యులు చెప్పినప్పటికీ వైసీపీ నేతలు తమ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ సంఘటన జరిగిన వెంటనే వివరాలు కావాలని కోరుతూ ఏపీ డీజీపీని గవర్నర్ నరసింహన్ అడిగారని.. ప్రొటోకాల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని లేదా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆయన సంప్రదించాలని అన్నారు. ఆ తర్వాత బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ లు ఈ సంఘటనపై స్పందించారని, ఇదంతా ‘ఆపరేషన్ గరుడ’లో భాగమేనని అన్నారు.
జగన్ పై దాడి జరిగిన అనంతరం ఆయన ఆసుపత్రిలో చేరలేదని, పోలీసులకు ఫిర్యాదు చేయలేదని.. జగన్ నవ్వుకుంటూ హైదరాబాద్ విమానమెక్కారని విమర్శించారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే టీడీపీ ప్రభుత్వంపై బురదజల్లేందుకు జరుగుతున్న కుట్రలని అచ్చెన్నాయుడు అనుమానం వ్యక్తం చేశారు.