cm chandrababu: ‘తిత్లీ’పై స్పందించని కేసీఆర్ కుటుంబం జగన్ పై దాడి జరగగానే స్పందిస్తారా?: సీఎం చంద్రబాబు
- ఏపీ పట్ల వారికి ఎందుకంత వివక్ష?
- జగన్ పై దాడిని పవన్ కల్యాణ్ వెంటనే ఖండించారు
- ఏపీపై అందరూ ఏకమై దాడులు చేస్తున్నారు
ఏపీలో తిత్లీ తుపాన్ సంభవించినప్పుడు ఏమాత్రం స్పందించని కేసీఆర్ కుటుంబం జగన్ పై దాడి జరగగానే మాత్రం స్పందించిందంటూ సీఎం చంద్రబాబునాయుడు సెటైర్లు విసిరారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ దాడి పట్ల సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత వెంటనే స్పందించారని, ఏపీ పట్ల వారికి ఎందుకంత వివక్ష అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైనా ఆయన విమర్శలు చేశారు. జగన్ పై దాడి జరిగిందంటూ పవన్ వెంటనే ఖండించారని, ఇదంతా చూస్తుంటే వీళ్లందరూ ఏకమయ్యారన్న విషయం స్పష్టమవుతోందని అన్నారు. విభజన కష్టాలతో ఉన్న ఏపీపై అందరూ ఏకమై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ‘ఆపరేషన్ గరుడ’ గురించి హీరో శివాజీ చెప్పినట్టే జరుగుతోందని అన్నారు. జగన్ పై దాడి చేసిన వ్యక్తి ఆయనకు వీరాభిమానినని చెప్పుకున్నాడని, జగన్ ని పొగుడుతూ, తనను తిడుతూ లేఖలు రాశాడని, ఈ దాడిని టీడీపీకి అంటగడతారా? అంటూ నిప్పులు చెరిగారు.