Rahul Gandhi: మా సీఎంలలో సగం మంది మహిళలే ఉండాలి: రాహుల్ గాంధీ
- వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో ఇది సాధ్యమవుతుంది
- మహిళలను ఎదగనివ్వకపోవడం బీజేపీ, ఆరెస్సెస్ లక్ష్యం
- కాంగ్రెస్‌కు, బీజేపీకి అదే తేడా
పాలనలో మహిళా భాగస్వామ్యాన్ని పెంచడంపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ దృష్టి సారించారు. వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సగం మంది మహిళా ముఖ్యమంత్రులు ఉండేలా కృషి చేయనున్నట్టు తెలిపారు. గురువారం రాజస్థాన్‌లోని కోట పట్టణంలో పార్టీ మహిళా నేతలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళలకు కాంగ్రెస్ సముచిత స్థానం ఇస్తుందన్న ఆయన బీజేపీ, ఆరెస్సెస్‌పై విమర్శలు కురిపించారు.
మహిళలు ఇల్లు దాటి బయటకు రాకూడదని ఆ రెండూ కోరుకుంటాయని, కాంగ్రెస్ మాత్రం మహిళలను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. మహిళలు ఏ రకంగానూ అభివృద్ధి చెందకూడదనేది బీజేపీ, ఆరెస్సెస్‌లు భావిస్తాయన్నారు. ఆరెస్సెస్ సమావేశాల్లో ఒక్క మహిళా కూడా లేకపోవడమే ఇందుకు ఉదాహరణ అని రాహుల్ విమర్శించారు. బీజేపీకి మహిళా విభాగం ఉన్నా అది అలంకార ప్రాయమేనని, అక్కడ ఎటువంటి నిర్ణయాలు తీసుకోరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు, బీజేపీకి మధ్య ఉన్న తేడా ఇదేనని రాహుల్ పేర్కొన్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి మహిళే అయినా, సాటి మహిళల గురించి ఆమెప్పుడూ ఆలోచించలేదని రాహుల్ విమర్శించారు.