Andhra Pradesh: మసీదులు, చర్చ్ లపై కూడా దాడులు జరగబోతున్నాయ్.. బీజేపీ నేతలకు నాపై కోపం అందుకే!: సీఎం చంద్రబాబు
- రమణ దీక్షితులను ఆయుధంగా వాడుకున్నారు
- టీటీడీపై తప్పుడు కేసులు వేస్తున్నారు
- ఒవైసీ, తొగాడియాను కూడా అరెస్ట్ చేశాం
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ ను అడ్డం పెట్టుకుని బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంతో విభేదించగానే తనను లక్ష్యంగా చేసుకుంటూ కుట్ర రాజకీయాలు మొదలయ్యాయని తెలిపారు. ఇందులో భాగంగా టీటీడీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులను ఆయుధంగా వాడుకున్నారనీ, తిరుమలలో ఏదో అక్రమాలు జరుగుతున్నట్లు ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. అమరావతిలో ఈ రోజు నిర్వహించిన కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో నిర్వహించిన లా అండ్ ఆర్డర్ సదస్సులో బాబు మాట్లాడారు.
పింక్ డైమండ్ కనిపించడం లేదనీ, ఇతర సాకులు చెబుతూ టీడీపీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు కొందరు వ్యక్తులు కుట్ర పన్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి.. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఒత్తిడి చేయడం కారణంగానే తాను కేసు వేసినట్లు అంగీకరించాడని వెల్లడించారు.
ఇప్పుడు మళ్లీ సుబ్రహ్మణ్య స్వామి హైకోర్టుకు రాబోతున్నాడని వ్యాఖ్యానించారు. టీటీడీని లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులు త్వరలోనే చర్చ్ లు, మసీదులు సహా ఇతర ప్రార్థనాలయాలపై దాడులు చేయబోతున్నారని హెచ్చరించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హద్దులు దాటి ప్రవర్తించినందుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీనీ, వీహెచ్ పీ నాయకుడు ప్రవీణ్ తొగాడియాను సైతం ఎన్టీయే ప్రభుత్వంలో అరెస్ట్ చేశామని చంద్రబాబు గుర్తుచేశారు.
తాను ఎవ్వరికీ లొంగననీ, ఈ కారణంగానే తనపై బీజేపీ నేతలు కక్ష కట్టి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. తనకు దేశం ముఖ్యమనీ, వ్యక్తులు కాదని స్పష్టం చేశారు.