MS Dhoni: టీ20ల నుంచి ధోనీ అవుట్.. మహేంద్రుడి టీ20 కెరీర్ ముగిసినట్టేనా?
- విండీస్, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లకు జట్ల ప్రకటన
- రెండింటిలోనూ ధోనీకి మొండిచేయి
- ధోనీ టీ20 కెరీర్‌పై అనుమానాలు
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ టీ20 కెరీర్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విండీస్, ఆస్ట్రేలియా జట్లతో త్వరలో జరగనున్న టీ20 సిరీస్‌ల కోసం భారత జట్లను ప్రకటించిన సెలక్టర్లు అందులో ధోనీకి చోటివ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీ శుక్రవారం రాత్రి నాలుగు వేర్వేరు జట్లను ప్రకటించింది. విండీస్‌తో స్వదేశంలో జరిగే టీ20 సిరీస్‌తోపాటు ఆసీస్‌తో జరిగే నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్, టీ20 సిరీస్‌లకు జట్లను ప్రకటించింది. అలాగే, న్యూజిలాండ్-ఎ జట్టుతో జరిగే అనధికారిక టెస్టు కోసం కూడా జట్టును ప్రటించారు.
ఓపెనర్ మురళీ విజయ్, రోహిత్ శర్మ, వికెట్ కీపర్ పార్థివ్ పటేల్‌లకు జట్టులో స్థానం కల్పించిన సెలక్టర్లు టీ20 సిరీస్‌లకు ధోనీని పక్కనపెట్టారు. దీంతో ఇక ధోనీని ఒక్క వన్డేలకే పరిమితం చేయాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక, ఆసియాకప్‌కు దూరమైన కోహ్లీ విండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కూ దూరమయ్యాడు. అతడి స్థానంలో స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తాడు. ధోనీని ఎంపిక చేయకపోవడంపై చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందిస్తూ రెండు టీ20 సిరీస్‌లలోనూ ధోనీ ఆడబోవడం లేదన్నాడు. అంతమాత్రాన అతడి కెరీర్ ముగిసిందని భావించాల్సిన పనిలేదన్నాడు. రెండో వికెట్ కీపర్‌ను పరీక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు.