Bihar: ఆరు నెలల ముందే కుదిరిన ఒప్పందం.. బీహార్లో బీజేపీ-జేడీయూ మధ్య సీట్ల పంపకం కొలిక్కి!
- బీజేపీ గత ప్రతిపాదనను తిరస్కరించిన నితీశ్
- దిగొచ్చిన అమిత్ షా
- సమాన సీట్ల పంపకానికి ఓకే
లోక్సభ ఎన్నికలకు ఆరు నెలల ముందే బీహార్లో మిత్రపక్షాలైన జేడీయూ-బీజేపీ మధ్య సీట్ల పంపకం కొలిక్కి వచ్చింది. ఎంపీ సీట్లను సమంగా పంచుకోవాలని నిర్ణయించినట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, జేడీయూ చీఫ్, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంయుక్తంగా వెల్లడించారు. ఎన్డీఏలోని మిగతా రెండు భాగస్వామ్య పక్షాలకు కూడా గౌరవప్రదంగా సీట్లు లభిస్తాయని పేర్కొన్నారు. మరో రెండు రోజుల్లో ఈ విషయంలో పూర్తి స్పష్టత వస్తుందన్నారు.
వచ్చే ఎన్నికల్లో తాము 20 స్థానాల్లో, జేడీయూ 12, ఎల్జేపీ 6, ఆర్ఎల్ఎస్పీ 2 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు గత నెలలో బీజేపీ ప్రకటించింది. ఈ ప్రతిపాదనను నితీశ్ తిరస్కరించడంతో ప్రతిష్ఠంభన ఏర్పడింది. దీంతో దిగివచ్చిన బీజేపీ సమంగా సీట్లు పంచుకుందామంటూ తాజాగా ప్రతిపాదించింది. బీహార్లో మొత్తం 40 లోక్సభ స్థానాలున్నాయి. తాజా ప్రతిపాదన ప్రకారం.. బీజేపీ, జేడీయూలు చెరో 16 సీట్లు, ఎల్జేపీ 6, ఆర్ఎల్ఎస్పీ రెండు స్థానాల్లో బరిలోకి దిగనున్నాయి.