Jagan: శ్రీనివాస్ జేబులో దొరికిన లేఖపై అనుమానాలు... ఒక్క మడతైనా పడకుండా సాధ్యమా?
- శ్రీనివాస్ జేబులో లెటర్ దొరికిందన్న పోలీసులు
- లేఖలో దస్తూరిపై ఇప్పటికే అనుమానాలు
- లేఖపై మడతలు లేకపోవడంతో తలెత్తుతున్న ప్రశ్నలు
వైఎస్ జగన్ పై దాడి చేసిన వైజాగ్ ఎయిర్ పోర్టు క్యాంటీన్ వెయిటర్ శ్రీనివాస్, దాడి వెనుక తన ఉద్దేశం గురించి ముందే ఓ లేఖను రాసిపెట్టి, జేబులో ఉంచుకున్నాడని చెబుతూ, ఏపీ పోలీసులు దాన్ని మీడియాకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తోంది. పోలీసులు విడుదల చేసిన లేఖ 11 పేజీలు ఉండగా, తొలుత శ్రీనివాస్ రాశాడని చెప్పిన పోలీసులు, దానిలోని దస్తూరీలో మార్పులు కనిపిస్తున్నాయని వార్తలు వచ్చిన తరువాత ఆ లేఖను తనతో పాటు మరో ఇద్దరితో రాయించాడని చెప్పారు. నిందితుడి సోదరి జే విజయలక్ష్మి, రెస్టారెంట్ లో పనిచేస్తున్న రేవతీపతి దస్తూరీ కూడా ఇందులో ఉందని అన్నారు.ఈ విషయాన్ని పక్కనపెడితే, పోలీసులు విడుదల చేసిన లేఖపై ఒక్క మడత కూడా లేకపోవడం కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది. నిందితుడి జేబులో పెట్టుకున్న లేఖపై మడతలు లేకపోవడం ఏంటని సోషల్ మీడియాలో పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదే లేఖ విషయమై శ్రీనివాస్ ను తొలుత అరెస్ట్ చేసిన విశాఖ ఎయిర్ పోర్టు సీఐఎస్ఎఫ్ పోలీసులు స్టేట్ మెంట్ ను విడుదల చేయలేదు. తమకు నిందితుడి జేబుల్లో లభించింది మరో చిన్న కత్తి మాత్రమేనని వారు తొలుత చెప్పారు.
అయితే, పోలీసులు విడుదల చేసిన లేఖలోని ప్రతి పేజీ కిందా సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సంతకం కనిపిస్తోంది. ఇందుకు అనుగుణంగానే, ఆ లేఖను సీఐఎస్ఎఫ్ అధికారులు సర్టిఫై చేసి తమకు ఇచ్చారని వైజాగ్ పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ లేఖ ఎక్కడిదన్న ప్రశ్నలకు, జేబులో పెట్టుకుంటే మడత ఎందుకు పడలేదన్న ప్రశ్నకు పోలీసు అధికారులు సమాధానం చెప్పాల్సివుంది.