Congress: కాంగ్రెస్‌తో పోరాడతా.. కానీ గాంధీ కుటుంబాన్ని ఒక్క మాటా అనను!: అజిత్ జోగి
- చత్తీస్‌గఢ్‌కు తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన జోగి
- వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు
- కాంగ్రెస్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయన్న మాజీ సీఎం
రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో తాను కాంగ్రెస్‌తో పోరాడతానని, అయితే గాంధీ కుటుంబాన్ని మాత్రం ఒక్క మాటా అనబోనని చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో సుదీర్ఘకాలంగా ఉన్న సంబంధాల నేపథ్యంలోనే ఆయనీ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెలలో రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో పోటీ తన పార్టీ జనతా కాంగ్రెస్ చత్తీస్‌గఢ్ (జేసీసీ)- భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మధ్యేనని పేర్కొన్నారు. మాయావతి సారథ్యంలోని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)తో జోగి పార్టీ పొత్తు పెట్టుకుంది.
‘‘కాంగ్రెస్ పార్టీ నుంచి నేను బయటకొచ్చాను. ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తా. కానీ గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా అనను. ఆ పార్టీ నాకు బోల్డంత ప్రేమను, అభిమానాన్ని పంచింది’’ అని జోగి స్పష్టం చేశారు. సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై వచ్చిన ఆరోపణలపై స్పందించాల్సిందిగా కోరినప్పుడు ఆయనీ వ్యాఖ్యలు చేశారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన అజిత్ జోగి 2016లో కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంతంగా పార్టీ ఏర్పాటు చేసుకున్నారు.