high court: ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టులో కీలక విచారణ
- డిసెంబర్ 15లోగా తాత్కాలిక నిర్మాణాలు పూర్తవుతాయన్న ఏపీ
- అవి పూర్తయ్యాకే విభజన నోటిఫికేషన్ ఇవ్వండి
- కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు
ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టులో ఈరోజు కీలక విచారణ జరిగింది. ఏపీలో హైకోర్టు భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు హైకోర్టును ఎందుకు విభజించకూడదంటూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు విచారణ చేపట్టింది. డిసెంబర్ 15లోగా అమరావతిలో హైకోర్టు తాత్కాలిక భవన నిర్మాణాలు పూర్తవుతాయని, ఆ తర్వాత సంబంధిత నోటిఫికేషన్ విడుదల చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఓ అఫిడవిట్ లో ఏపీ ప్రభుత్వం రెండురోజుల క్రితమే పేర్కొంది.
ఈ రోజు విచారణ సందర్భంగా ఇదే విషయాన్ని ఏపీ తరపు న్యాయవాది నారీమన్ సుప్రీంకోర్టులో ప్రస్తావించారు. దీంతో అమరావతిలో హైకోర్టు తాత్కాలిక భవన నిర్మాణాలు పూర్తయ్యాకే హైకోర్టు విభజనకు నోటిఫికేషన్ విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టు తాత్కాలిక భవన నిర్మాణాల విషయమై ఏపీ ప్రభుత్వం అంత స్పష్టంగా చెబుతోంది కనుక, సంబంధిత ఫొటోలను న్యాయస్థానానికి అందజేయాలని కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది వేణుగోపాల్ కోరారు.