kcr: కేసీఆర్ ఉన్నాడు చాలని ప్రజలు ధీమాగా ఉన్నారు: మంత్రి హరీష్ రావు
- టీఆర్ఎస్ లో చేరిన ఆందోల్ కాంగ్రెస్ నేతలు
- వర్షాల కోసం దిక్కులు చూడాల్సిన అవసరం లేదు
- సింగూరు ద్వారా తొలిసారిగా ఆందోల్ కే నీరిచ్చాం
వర్షాల కోసం దిక్కులు చూడాల్సిన అవసరం లేదని, కేసీఆర్ ఉన్నాడు చాలు నీళ్లిస్తారని ప్రజలు ధీమాగా ఉన్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. హరీశ్ రావు సమక్షంలో ఆందోల్ కు చెందిన కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా వారికి టీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆయన ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డి, అనిల్ రెడ్డి లు తమ పార్టీలో చేరడం సంతోషకరమని, వారిని చూస్తుంటే ఆందోల్ పెద్ద చెరువు నిండినట్టుందని సంతోషం వ్యక్తం చేశారు. సింగూరు ద్వారా మొట్టమొదటిసారిగా ఆందోల్ నియోజకవర్గానికే నీళ్లు ఇచ్చామని గుర్తుచేసుకున్నారు. సింగూరు ద్వారా ఆందోల్ లో లక్ష ఎకరాలకు నీరందిస్తామని చెప్పారు.
ఈ సంద్భంగా కాంగ్రెస్ పార్టీపై ఆయన విరుచుకుపడ్డారు. ‘యెడ్డెమంటే తెడ్డెం’ అనే రకం ‘కాంగ్రెస్’ అని, తెలంగాణలో అమలవుతున్న కల్యాణలక్ష్మి పథకాన్ని బంద్ చేస్తామని ఆ పార్టీ అంటోందని, అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టుని రద్దు చేస్తామని కూడా ‘కాంగ్రెస్’ అనొచ్చని ప్రశ్నించారు. చంద్రబాబు పాటే కాంగ్రెస్సోళ్లు పాడుతున్నారని విమర్శించారు.
టీడీపీతో జతకట్టిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొస్తే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని, అవకాశవాద రాజకీయాలను ప్రోత్సహిస్తారా? లేక రాష్ట్రాభివృద్ధి కోసం మళ్లీ టీఆర్ఎస్ కే పట్టం కడతారా? అనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలని కోరారు. తెలంగాణలో అధికారం మారబోతోందన్న అమిత్ షా వ్యాఖ్యలు చూస్తే నవ్వొస్తోందని, ముందు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో బీజేపీ గెలుస్తుందో లేదో చూసుకోండని ఆయన సెటైర్లు వేశారు.