Republic Day: మోదీకి చెయ్యిచ్చిన ట్రంప్.. రిపబ్లిక్ డే వేడుకలకు డుమ్మా!
- రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించిన మోదీ
- షెడ్యూలు సహకరించడం లేదన్న వైట్ హౌస్
- త్వరలోనే మోదీని ట్రంప్ కలుస్తారన్న సారా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు చేయిచ్చారు. రిపబ్లిక్ డే వేడుకలకు హాజరుకాలేకపోతున్నట్టు ప్రకటించారు. బిజీ షెడ్యూలు కారణంగా ట్రంప్ భారత గణతంత్ర వేడుకలకు హాజరుకాలేకపోతున్నట్టు వైట్‌హౌస్ ప్రకటించింది. గతేడాది వాషింగ్టన్లో జరిగిన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా భారత ప్రధాని నరేంద్రమోదీ ట్రంప్‌ను ఆహ్వానించారు. ఈ ఏడాది జూలైలో వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ సారా శాండార్స్ మాట్లాడుతూ భారత్ నుంచి ఆహ్వానం అందిందని, అయితే నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.
తాజాగా వైట్‌హౌస్ మరో ప్రకటన విడుదల చేస్తూ.. ‘‘భారత గణతంత్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా ప్రధాని మోదీ నుంచి ఆహ్వానం అందింది. అయితే, షెడ్యూలు సహకరించని కారణంగా ట్రంప్ హాజరు కాబోవడం లేదు’’ అని అందులో పేర్కొన్నారు. మోదీకి- ట్రంప్‌కు మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని, అమెరికా-భారత్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలని ట్రంప్ యోచిస్తున్నట్టు వైట్ హౌస్ అధికార ప్రతినిధి తెలిపారు. వీలైనంత త్వరలో మోదీని కలవాలని ట్రంప్ యోచిస్తున్నట్టు చెప్పారు.