Andhra Pradesh: నేడు కడపలో ధర్మపోరాట దీక్ష.. హాజరుకానున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్!
- ప్రొద్దుటూరులోని బొల్లవరంలో ఏర్పాట్లు పూర్తి
- హాజరుకానున్న 2 లక్షల మంది
- మధ్యాహ్నం కడపకు వెళ్లనున్న ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఈ రోజు టీడీపీ కడప జిల్లాలో ధర్మ పోరాట దీక్షకు సిద్ధమైంది. జిల్లాలోని ప్రొద్దుటూరులో ఉన్న బొల్లవరంలో ఈ రోజు మధ్యాహ్నం సభ నిర్వహించేందుకు టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశాయి. ఇందులోభాగంగా దాదాపు 86 ఎకరాల్లో భారీ సభా వేదికతో పాటు 50 వేల కుర్చీలను ఏర్పాటు చేశారు. దాదాపు 2 లక్షల మంది హాజరవుతారన్న అంచనాల నేపథ్యంలో నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ లు హాజరుకానున్నారు. తొలుత ఈ నెల 20న ధర్మపోరాట దీక్ష నిర్వహించాలని భావించినప్పటికీ వర్షం, మరికొన్ని అనివార్య కారణాలతో ఈరోజుకు కార్యక్రమం వాయిదా పడింది. కాగా, ఈ రోజు మధ్యాహ్నం 12.45 గంటలకు చంద్రబాబు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకుంటారు. అనంతరం గండికోట ప్రాజెక్టు పైలాన్ ను ఆవిష్కరిస్తారు
ఆ తర్వాత మధ్యాహ్నం 1.35 గంటలకు ప్రొద్దుటూరుకు బయలుదేరి వెళ్లనున్నారు. ఓవైపు ప్రతిపక్ష నేత జగన్ పై దాడి, మరోవైపు జిల్లాలో సీఎం చంద్రబాబును అడ్డుకుని తీరుతామని కమ్యూనిస్ట్ నేతలు హెచ్చరించిన నేపథ్యంలో ఈ కార్యక్రమానికి పోలీసులు భారీ స్థాయిలో, కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.