Andhra Pradesh: పశ్చిమగోదావరి జిల్లాలో భారీ కుంభకోణం.. రైతుల పేరిట బ్యాంకుకు రూ.2.20 కోట్ల కుచ్చుటోపి!
- ఫోర్జరీ పత్రాలు సమర్పించిన వాసి కుమార్
- నిధులను తన ఖాతాలోకి మళ్లించుకున్న వైనం
- బ్యాంకు అధికారుల పాత్రపై అనుమానాలు
పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపూర్ లో ఓ మోసగాడు రెచ్చిపోయాడు. నకిలీ లోన్ కార్డులు, భూముల పత్రాలు సృష్టించి కోట్లాది రూపాయల నగదును తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. అనంతరం నగదు మొత్తాన్ని తీసుకుని ఉడాయించాడు. అయితే ఈ లోన్లకు సంబంధించి బ్యాంకు నుంచి రైతులకు నోటీసులు రావడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఇక్కడి యలమంచిలి ప్రాంతానికి చెందిన వాసి కుమార్ మోసాలు చేయడంలో ఆరితేరాడు. వ్యవసాయ రుణాలను జారీచేయడంలో ఉన్న లొసుగులను తెలుసుకుని 60 మంది రైతుల లోన్ కార్డులను, భూమి పత్రాలను ఫోర్జరీ చేశాడు. అనంతరం వాటిని బ్యాంకులో సమర్పించి ఏకంగా రూ.2.20 కోట్ల మొత్తాన్ని కాజేశాడు. ఈ నగదుతో అక్కడి నుంచి ఉడాయించాడు. అయితే తాజాగా రుణాలను చెల్లించాలని బ్యాంకు రైతులకు నోటీసులు జారీచేసింది.
దీంతో విస్తుపోయిన రైతులు హుటాహుటిన బ్యాంకుకు చేరుకోవడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తమకు సంబంధించిన లోన్ కార్డులు, పత్రాలు ఫోర్జరీ చేసిన కుమార్ ఈ మోసానికి పాల్పడినట్లు తెలుసుకున్న రైతులు విస్తుపోయారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బ్యాంకు ఉద్యోగుల సహకారం లేకుండా అంతమొత్తంలో భారీ నగదును ఓకే ఖాతాలోకి బదలాయించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు అధికారులు నిందితుడితో కలిసి ఈ మోసానికి పాల్పడ్డారా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.