Chandrababu: వైసీపీ అధినేత జగన్ ట్రాప్ లో పడొద్దు.. టీడీపీ నేతలకు చంద్రబాబు సూచన!
- గత ఐదు రోజులుగా ఇదేచర్చ నడుస్తోంది
- అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు
- సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
ఆంధ్రప్రదేశ్ లో గత ఐదు రోజులుగా ప్రతిపక్ష నేత జగన్ పై కత్తిదాడి ఘటన పైనే చర్చ నడుస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత జగన్ ఉచ్చులో పడొద్దని ఈ సందర్భంగా మంత్రులు, టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు. కోడి కత్తితో దాడి ఘటనపై అంత తీవ్రంగా స్పందించాల్సిన అవసరం లేదని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ రోజు కడపకు బయలుదేరేముందు పార్టీ నేతలతో చంద్రబాబు పలు అంశాలపై మాట్లాడారు.
శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను దెబ్బకు నష్టపోయిన ప్రజలకు త్వరలోనే చెక్కులను పంపిణీ చేస్తామని తెలిపారు. వైసీపీ అధినేత జగన్ పై గత గురువారం వైజాగ్ ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు అనే యువకుడు కోడి పందేల కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గాయపడ్డ జగన్ హైదరాబాద్ లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నారు. అనంతరం డిశ్చార్జ్ అయ్యారు.
కాగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఈ దాడి జరిగిందనీ వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా, ఎయిర్ పోర్టు అన్నది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విషయమనీ, దానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పై హత్యాయత్నం ఘటనకు అంతగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు.