jc diwakar reddy: ఎవరు గొప్ప నేతో తెలుసుకొని ఓట్లు వేయండ్రా నాయనా: జేసీ దివాకర్ రెడ్డి
- తిత్లీ తుపాను బాధితులకు మోదీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు
- ఆయన చర్యకు నిరసనగానే నేను రూ. 10 లక్షలు ఇస్తున్నా
- జగన్ తెలివైనవాడు అయితే.. ఒక్కసారైనా శ్రీకాకుళం వెళ్లి రావాలి కదా?
తిత్లీ తుపాను బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రూ. 10 లక్షల చెక్కును అందించారు. ప్రొద్దుటూరులో జరిగిన ధర్మపోరాట దీక్ష సందర్భంగా ముఖ్యమంత్రికి ఆయన చెక్కును అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సభలో ఆయన నవ్వులు పూయించారు. చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడుతూ, 'సార్ నేనేమీ పెద్ద షావుకారుని కాదు. అంతో ఇంతో పిసినారితనం కూడా నాకు ఉంది' అంటూ వ్యాఖ్యానించారు. పిసినారితనం ఉన్నప్పటికీ మీకు చెక్కు ఎందుకు ఇస్తున్నానంటే ప్రధాని మోదీకి మమకారం అనేది లేదని... ఆయన సన్యాసని, సంసార మాధుర్యం లేని వ్యక్తి అని అన్నారు. తిత్లీ తుపానుకు శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం అయితే ఆ పెద్ద మనిషి ఇంత వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఆయన చర్యకు నిరసనగా తాను ఈ చెక్కును ఇస్తున్నానని అన్నారు.
తుపాను సమయంలో మా పెద్ద మనిషి, మా జగన్ ఆ పక్కనే ఉన్నాడని... తెలివైన వాడైతే ఒక్కసారైనా శ్రీకాకుళం వెళ్లి రావాలి కదా? అని జేసీ మండిపడ్డారు. కడప జిల్లాలో 50 శాతం మంది రెడ్లు ఉన్నప్పటికీ వారు జగన్ ను ఎందుకు సపోర్ట్ చేయడం లేదంటే కారణం ఇదేనని చెప్పారు. కులం అన్నం పెట్టదని, కులం వల్ల ఓట్లు రాలవని అన్నారు. మహాత్మాగాంధీ కొడుకులు ఎక్కడున్నారని, వైయస్ కొడుకు ఏ స్థాయిలో ఉన్నాడని విమర్శించారు. వైయస్ చనిపోయి పదేళ్లు అవుతోందని... గండికోటకు నీరు తీసుకు రావడానికి నీవు ఏం ప్రయత్నం చేశావని జగన్ ను ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబు గండికోటకు నీరు తెప్పించారని... ఆ నీరు కేవలం కమ్మవారు మాత్రమే తాగుతారా? మీరు తాగరా? అంటూ నిప్పులు చెరిగారు. 'ఎవరు గొప్ప నేతో తెలుసుకొని ఓట్లు వేయండ్రా నాయనా. చంద్రబాబుకు ఓట్లు వేయండ్రా' అంటూ చేతులెత్తి మొక్కారు. రెడ్డి అనే కుల పిచ్చి వద్దని... దాని వల్ల మీరు, మేము అందరం నాశనమవుతామని చెప్పారు. అన్ని ప్రాంతాలకు నీరు ఇస్తున్న చంద్రబాబును మర్చిపోవద్దన్నారు