Jagadishreddy: దేశ చరిత్రలో మొదటిసారి ఎన్నికల మ్యానిఫెస్టోను టీఆర్ఎస్ అమలుపరచింది: జగదీష్ రెడ్డి
- చంద్రబాబు కుట్రలో కాంగ్రెస్ బంధీ అయింది
- సూర్యపేటకు కృష్ణా జలాలను అందించిన ఘటన
- నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఆసరా టీఆర్ఎస్దే
సూర్యాపేట పట్టణం, సూర్యాపేట రూరల్, చివ్వేంల మండలాల టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి కుట్రలో కాంగ్రెస్ పార్టీ బందీ అయిందని విమర్శించారు. రాష్ట్ర రాజధానికి చేరుతున్న అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి పానగల్లు ఉదయ సముద్రానికి చేరుతున్న నీటిని మూసికి చేర్చి ఆ నీటితో మూసి నదిని ప్రక్షాళన చేసి సూర్యపేటకు మొట్టమొదటి సారిగా కృష్ణా జలాలను అందించిన ఘనత టీఆర్ఎస్ పార్టీదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కొనియాడారు.
ఇమాంపెట్ ఉండ్రుగొండ గుట్టలో నిర్మించిన వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్‌తో సూర్యాపేట పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన మంచినీటిని అందించడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. భారతదేశ చరిత్రలో మొదటిసారిగా ఎన్నికల మ్యానిఫెస్టోను పూర్తిగా అమలు చేసి టీఆర్ఎస్ రికార్డు సృష్టించిందన్నారు. మ్యానిఫెస్టోలో లేని కళ్యాణలక్ష్మీ, అమ్మవడి, కేసీఆర్ కిట్, వసతి గృహంలో సన్నబియ్యం అన్నం వంటి విప్లవాత్మక పథకాలు అమలు పరిచామన్నారు. మొట్టమొదటిసారిగా నిరుద్యోగ భృతి ప్రకటించిన పార్టీ టీఆర్ఎస్ అని, నిరుద్యోగ యువతకు ఈ పథకం ఆసరా అవుతుందన్న విషయాన్ని యువత దృష్టికి చేరేలా పార్టీ యంత్రాంగం ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు.
ఎన్నికలలో పార్టీ క్యాడర్, నాయకులు అనుసరించాల్సిన వ్యూహాన్నీ శ్రేణులకు నిర్ధేశించారు. కొత్తగా నమోదైన ఓటర్లపై దృష్టి సారించడంతోపాటు పోలింగ్ శాతాన్ని పెంపొందించేందుకు ప్రయత్నం చేయాలన్నారు. ఒక్క సూర్యాపేట పట్టణంలోనే 90 శాతానికి పైబడి ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసేందుకు సన్నద్దమయ్యారని ఆశాభావం వ్యక్తం చేశారు.