Chandrababu: జగన్ను పరామర్శించాలనుకున్నా.. కానీ అందుకే ఆగిపోయా: చంద్రబాబు
- విషయం తెలిసిన వెంటనే ఫోన్ చేద్దామనుకున్నా
- వైసీపీ నేతలు నేనే చేయించానని అన్నారు
- దర్యాప్తుకు సహకరించాలి
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి తర్వాత తానెందుకు ఆయనను పరామర్శించలేనిదీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో మంగళవారం నిర్వహించిన ధర్మపోరాట దీక్ష సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. జగన్పై కత్తిదాడి జరిగిన వెంటనే పరామర్శించాలని అనుకున్నానని, అయితే వైసీపీ నేతలు తననే కుట్రదారుడిగా, ఏ-1 నిందితుడిగా ఆరోపించడంతో వెనక్కి తగ్గానని వివరించారు.
జగన్పై దాడి చేసింది ఆయన వీరాభిమానేనని, సానుభూతి కోసమే చేశానని స్వయంగా చెప్పాడని చంద్రబాబు పేర్కొన్నారు. అయినా, వైసీపీ నేతలు తనపైనే విమర్శలు చేస్తున్నారని, ఈ కేసంటే వారెందుకు భయపడుతున్నారో తనకు అర్థం కావడం లేదని అన్నారు. దాడి చేసింది వైసీపీ కార్యకర్తేనని, దర్యాప్తుకు సహకరించాలని కోరారు. ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదన్న జగన్పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థ శాశ్వతమని, ప్రభుత్వాలు మాత్రం వచ్చిపోతుంటాయని అన్నారు. తనపై దాడి జరిగినప్పుడు కూడా తనెప్పుడూ ఎవరిపైనా విమర్శలు చేయలేదని చంద్రబాబు గుర్తు చేశారు.