Andhra Pradesh: 'హత్యాయత్నంపై రాజకీయాలా?' అంటూ టీడీపీ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు రామారెడ్డి రాజీనామా!
- బాధ్యతగల సీఎం సరిగ్గా స్పందించలేదు
- పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా
- తూ.గో జిల్లా నేత మేడపాటి రామారెడ్డి
విపక్ష నాయకుడిపై హత్యాయత్నం జరిగితే, బాధ్యతగల సీఎం స్థానంలో ఉన్న చంద్రబాబు, సరిగ్గా స్పందించలేదని, నిజాలు నిగ్గు తేల్చడంలో ఆయన తీరు సరిలేదని ఆరోపిస్తూ, తూర్పు గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు మేడపాటి రామారెడ్డి, తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆపై మీడియాతో మాట్లాడిన ఆయన, ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతోనే తాను టీడీపీలో పనిచేస్తున్నానని, మానవత్వం ఉన్న వారు ఎవరైనా జగన్ పై జరిగిన హత్యాయత్నాన్ని ఖండించాల్సిందేనని అన్నారు. కానీ, ఏపీలో అందుకు విరుద్ధంగా జరిగిందని, సీఎం నుంచి మంత్రుల వరకూ విచక్షణ కోల్పోయి మాట్లాడారని ఆయన ఆరోపించారు. పార్టీ అధినేత వ్యవహార శైలిని మంత్రులు అనుసరిస్తున్నారని, ఈ కారణాలతో తాను టీడీపీలో ఇమడలేక పోతున్నానని అన్నారు. మరో పార్టీలో చేరాలన్న ఉద్దేశం తనకు లేదని, తనకు తెలుగుదేశం పార్టీ అంటేనే ఇష్టమని చెప్పారు. తనకు పదవి ఇచ్చిన నాయకులకు కృతజ్ఞతలు చెబుతూనే పార్టీని వీడుతున్నానని అన్నారు.