MP sivaprasad: వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టే అర్హత బీజేపీకి లేదు : టీడీపీ ఎంపీ శివప్రసాద్
- సర్దార్ వేషంలో తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన
- పటేల్ దేశాన్ని కలపాలనుకుంటే మోదీ విడదీయాలనుకుంటున్నారు
- మోదీ వచ్చాక పటేల్ ఆలోచనలకు భిన్నమైన నిర్ణయాలు
రాష్ట్రాలను విడగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ప్రభుత్వానికి, దేశాన్ని సమైక్యంగా ఉంచి పటిష్ట పరచాలనుకున్న ఉక్కుమనిషి పర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టే అర్హత లేదని టీడీపీ ఎంపీ శివప్రసాద్ ధ్వజమెత్తారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతో గుజరాత్లో ఏర్పాటు చేసిన అత్యంత ఎత్తయిన పటేల్ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా పటేల్ వేషధారణలో ప్రసాద్ బుధవారం తిరుపతి మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. మోదీ ప్రభుత్వం వచ్చాక పటేల్ ఆలోచనలకు భిన్నమైన నిర్ణయాలే తీసుకుంటున్నారని విమర్శించారు. అందుకే పటేల్ గుజరాత్లో లేరని, పారిపోయి తిరుపతి వచ్చారని తెలిపారు. ఏ రాష్ట్రంతోనూ సఖ్యతలేని మోదీ పటేల్ విగ్రహం ఏర్పాటు ద్వారా మార్కులు కొట్టేయాలని చూస్తున్నారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ అంటే మోదీకి నచ్చదని, అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబును ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్నిరకాలుగా ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు.