rbi: కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ వివాదం నేపథ్యంలో ఆర్థికశాఖ కీలక ప్రకటన!

  • ఆర్‌బీఐతో కేంద్రం రాజీ 
  • ఆర్‌బీఐ స్వతంత్రతను కేంద్ర గౌరవిస్తోంది
  • ఆర్‌బీఐ, కేంద్రం మధ్య విస్తృత సంప్రదింపులు

ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా స్పందించింది. రిజర్వ్‌ బ్యాంక్‌ స్వతంత్రతను ప్రభుత్వం గౌరవిస్తోందని, అయితే ఎప్పటికప్పుడు ఆర్‌బీఐ, కేంద్రం మధ్య విస్తృత సంప్రదింపులు జరుగుతాయని ఆర్థికశాఖ స్పష్టతనిచ్చింది. ఆర్‌బీఐ చట్టానికి లోబడి కేంద్ర బ్యాంకుకు స్వతంత్రత ఉండటం చాలా ముఖ్యమని ఆర్థికశాఖ పేర్కొంది. పాలనా అవసరాల పరంగా ఇది ఆమోదయోగ్యమేనని అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వాలు దీన్ని గౌరవిస్తూ వస్తున్నాయని, దేశ ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా, ప్రజా ప్రయోజనాల మార్గదర్శకత్వంలోనే ప్రభుత్వం, కేంద్రబ్యాంకు పనిచేస్తున్నాయని స్పష్టత నిచ్చింది. ఇతర నియంత్రణ సంస్థల మాదిరిగానే కేంద్రం, ఆర్‌బీఐ మధ్య పలు అంశాలపై సంప్రదింపులు జరుగుతాయని వెల్లడించింది.

అయితే కేంద్రప్రభుత్వం ఎప్పటికప్పుడూ సంప్రదింపులను బహిర్గతం చేయలేదని, కేవలం తుది నిర్ణయాలను మాత్రమే ప్రకటించగలుగుతామని వెల్లడించింది. ఈ సంప్రదింపుల ద్వారా సమస్యలను కేంద్ర ప్రభుత్వం అంచనా వేసి, సాధ్యమైన పరిష్కారాలను సూచిస్తూ ఉంటుందని, ఇక మీదట కూడా కేంద్రం ఇలాగే చేస్తుందని ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్ధిక శాఖ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం నేపథ్యంలో విశేషాధికారాలను ఉపయోగించి ఆర్‌బీఐకి మార్గదర్శకాలు జారీ చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు మొదట వార్తలు వచ్చాయి. అయితే ఈ పరిణామంతో ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం రాజీ ధోరణిలో వ్యవహరించనున్నాయి.

  • Loading...

More Telugu News