Merit: 100కు 98 మార్కులు సాధించిన 96 ఏళ్ల బామ్మ
- బామ్మ సంకల్పానికి అడ్డురాని వయసు
- శ్రద్ధగా పాఠాలు విని పరీక్షలో ప్రతిభ
- బామ్మకు పలువురి ప్రశంసలు
అక్షరాస్యురాలిగా మారాలనుకున్న ఓ బామ్మ సంకల్పం ముందు తన 96 ఏళ్ల వయసు అడ్డంకిగా మారలేదు. 96 ఏళ్ల వయసులో 100కు 98 మార్కులు సాధించింది. పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చునని యువతకు స్ఫూర్తిగా నిలిచింది. 100 శాతం అక్షరాస్యత సాధించాలని భావిస్తున్న కేరళ సర్కార్కు తనవంతు సహకారాన్ని అందించి అందరి మన్ననలు పొందుతోంది.
కేరళలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కేరళలోని అలప్పుజాకు చెందిన కార్తియాని అమ్మ అనే 96 ఏళ్ల వృద్ధురాలు లేటు వయసులో అక్షరాస్యురాలిగా మారింది. ప్రభుత్వ ప్రవేశపెట్టిన ‘అక్షర లక్ష్యం’ కార్యక్రమంలో చేరింది. కోర్సులో పాఠాలు శ్రద్దగా విని చదువు నేర్చుకుంది.
కోర్సు పూర్తయిన తర్వాత ఇటీవలే నిర్వహించిన పరీక్షలో బామ్మ తన ప్రతిభ చాటుకుంది. ఫలితాల్లో వందకు 98 మార్కులు సాధించి అందరి దృష్టిని ఆకట్టుకుని ఆమె వార్తల్లో నిలిచింది. దీంతో బామ్మను పలువురు అభినంధిస్తున్నారు. 100 శాతం అక్షరాస్యత సాధించే ఉద్దేశంతో ‘అక్షర లక్ష్యం’ అనే పేరుతో కేరళ ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. సుమారు 42 వేల మందికి పైగా ఈ కోర్సులో ఉత్తీర్ణత సాధించారు.