USA: అదుపుతప్పి చెట్టెక్కి కూర్చున్న కారు... ఆరు రోజులు అందులోనే ఒంటరి మహిళ!
- అమెరికాలోని ఆరిజోనాలో ఘటన
- వేగంగా వెళుతూ యాక్సిడెంట్ కు గురైన కారు
- ఆరు రోజుల తరువాత ఫెన్సింగ్ తెగివుండటాన్ని గమనించిన అధికారులు
వేగంగా వెళుతూ అదుపు తప్పిన ఓ కారు, గాల్లోకి ఎగిరి, ఓ చెట్టుపై పడగా, అందులో నుంచి బయటకు ఎలా రావాలో తెలియక ఓ మహిళ (53) ఆరు రోజుల పాటు అవస్థపడిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఆరిజోనా పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, నార్త్ ఆఫ్ ఫీనిక్స్ కు 80 కిలోమీటర్ల దూరంలోని వికెన్ బర్గ్ సమీపంలో జరిగింది. నేషనల్ రూట్ 60పై వెళుతున్న మహిళ వాహనం అదుపుతప్పి, గాల్లోకి ఎగిరి, దాదాపు 50 అడుగుల దూరంలోని చెట్టుపై పడి, గాల్లో నిలిచింది. ఈ ఘటనను ఎవరూ చూడలేదు.
ఆరు రోజుల తరువాత రోడ్డుపై ఫెన్సింగ్ తెగిపడి వుండటాన్ని చూసిన ఆరిజోనా హైవే నిర్వహణా బృందం, గాలింపు చేపట్టగా, చెట్టుపై చిక్కుకున్న కారు కనిపించింది. ఆ వెంటనే సహాయక బృందం కారున్న చోటకు చేరుకోగా, అందులో ఎవరూ కనిపించలేదు. అక్కడికి సమీపంలోని ఓ నది వైపు కాలి అడుగులు గుర్తించిన అధికారులు, దాదాపు 475 మీటర్ల దూరంలో తీవ్రగాయాలతో స్పృహతప్పి పడివున్న మహిళను చూశారు.
తాను చాలా రోజుల తరువాత అతి కష్టం మీద కిందకు దిగివచ్చానని ఆమె చెప్పింది. వెంటనే హెలికాప్టర్ ను పిలిపించిన రెస్క్యూ సిబ్బంది, ఆమెను ఆసుపత్రికి తరలించారు. రెస్క్యూ బృందం కృషి కారణంగానే ఆమె ప్రాణాలతో బయటపడిందని డిపార్ట్ మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ డైరెక్టర్ కల్నల్ ఫ్రాంక్ మిల్ స్ట్రెడ్ వ్యాఖ్యానించారు.