rbi: కేంద్రంతో కలసి పని చేయండి, లేకపోతే తప్పుకోండి!: ఆర్బీఐ గవర్నర్ ను ఉద్దేశించి ఆరెస్సెస్ సంచలన వ్యాఖ్యలు
- దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్రంతో కలసి పని చేయాలన్న అశ్వనీ మహాజన్
- దేశంలోని క్షేత్ర స్థాయి పరిస్థితులను ఆర్బీఐ పట్టించుకోవడం లేదు
- ఆర్బీఐ వద్ద ఉన్న మిగులు నిధులను వాడుకునే అవకాశం కేంద్రానికి కల్పించాలి
ఆర్బీఐకి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య అంతరం పెరుగుతున్న నేపథ్యంలో ఆరెస్సెస్ కు చెందిన స్వదేశీ జాగరణ్ మంచ్ ఆర్థిక వ్యవహారాల విభాగం అధ్యక్షుడు అశ్వనీ మహాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో కలసి పని చేయాలని, లేకపోతే పదవి నుంచి తప్పుకోవాలని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ను ఉద్దేశించి అన్నారు. ప్రజల్లో ఆందోళనలు రేకెత్తించే వ్యాఖ్యలు చేయకుండా ఆర్బీఐ అధికారులను ఉర్జిత్ నియంత్రించాలని చెప్పారు. క్రమశిక్షణతో వ్యవహరించాలని, లేకపోతే రాజీనామా చేయడమే మేలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీకి సైద్ధాంతిక సలహాదారుడిగా కూడా అశ్వనీ మహాజన్ వ్యవహరిస్తుండటం గమనార్హం.
ఆర్థికరంగంలో నిష్ణాతులైన విదేశీయుడిని ఆర్బీఐలో నియమిస్తారా? అనే ప్రశ్నకు బదులుగా... దేశంలో ఎంతో మంది ఆర్థిక నిపుణులు ఉన్నారని... వీరిలో ఎవరినో ఒకరిని నియమిస్తామని అశ్వనీ మహాజన్ తెలిపారు. అధిక వడ్డీ రేట్లు చిన్న వ్యాపారస్తుల నడ్డి విరుస్తున్నాయని... వారికి ఉపశమనం కలిగించడం ద్వారా లక్షలాది ఉద్యోగాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. కానీ, ఆర్బీఐ మొండిగా వ్యవహరిస్తోందని... భారత్ లోని క్షేత్ర స్థాయి పరిస్థితులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆర్బీఐ వద్ద భారీగా ఉన్న మిగులు నిధులను ఉపయోగించుకునే అవకాశాన్ని కేంద్రానికి కల్పించాలని... దేశ ఆర్థిక వృద్ధి రేటును మరింత పైస్థాయికి తీసుకెళ్లడానికి ఇది దోహదపడుతుందని చెప్పారు.
మరోవైపు, ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయబోతున్నారనే వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీని ప్రభావంతో రూపాయి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీంతో, రూపాయి విలువ పతనమవుతోంది.