Andhra Pradesh: ‘రాజశేఖర్.. నువ్వు ఫినిష్’ అని చంద్రబాబు హెచ్చరించారు.. అదేరోజు వైఎస్ ప్రమాదంలో చనిపోయారు!: వైసీపీ నేత రోజా
- జగన్ పై దాడికి చంద్రబాబు కుట్ర
- బాబును దేశం నుంచి తరిమికొట్టాలి
- జగన్ కు భద్రత కల్పిస్తారన్న నమ్మకం లేదు
‘నాతో పెట్టుకుంటే నువ్వు ఫినిష్’ అని చంద్రబాబు వైఎస్ రాజశేఖరరెడ్డితో అన్నారనీ, అదే రోజు హైలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ ప్రాణాలు కోల్పోయారని వైసీపీ నేత రోజా తెలిపారు. తన రాజకీయ ఎదుగుదల కోసం చంద్రబాబు ఎవరినైనా అడ్డు తొలగించుకుంటారని వ్యాఖ్యానించారు. రాజకీయంగా అడ్డొచ్చిన కుటుంబ సభ్యులనే పక్కకు తప్పించిన చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు.
తాజాగా జగన్ కు వస్తున్న అశేష ప్రజాదరణను తట్టుకోలేక జగన్ పై చంద్రబాబు ఈ దాడి చేయించారని ఆరోపించారు. ఈ రోజు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో సమావేశమైన అనంతరం వైసీపీ నేతలతో కలిసి రోజా మీడియాతో మాట్లాడారు. కేంద్ర విచారణ సంస్థలు దర్యాప్తు ప్రారంభించగానే చంద్రబాబు కేంద్రం కాళ్లు పట్టుకుంటారని రోజా ఎద్దేవా చేశారు.
దేశం, రాష్ట్రాలు బాగుండాలంటే చంద్రబాబును భారత్ నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుపై ఏపీలో తీవ్ర వ్యతిరేకత ఉందనీ, టీడీపీ ప్రభుత్వ పునాదులు కదులుతున్నాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే కేంద్రంతో సఖ్యత చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ, బీజేపీ నేతలతో చంద్రబాబు సమావేశమవుతున్నారని పేర్కొన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం ఎవ్వరికీ భద్రత ఇవ్వదని తెలిపారు. కనీసం ఎమ్మెల్యే అయిన తనకు భద్రత కల్పించాలని కోరినా ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకూ స్పందించలేదన్నారు. ఏపీ ప్రభుత్వం జగన్ కు భద్రతను పెంచుతుందన్న నమ్మకం తమకు లేదనీ, జగన్ ను తామే కాపాడుకుంటామని స్పష్టం చేశారు. విశాఖ ఎయిర్ పోర్టులో నిబంధనలకు విరుద్ధంగా జగన్ ను 8 గంటలు ఏపీ పోలీసులు మఫ్టీలో ఎలా నిర్బంధించారనీ, మహిళా పార్లమెంటుకు హాజరైన తనను మఫ్టీలో వచ్చి ఎలా కిడ్నాప్ చేశారని రోజా ప్రశ్నించారు. జగన్ పై హత్యాయత్నం ఘటనపై థర్డ్ పార్టీ సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.