Bonda Uma: జీవీఎల్... గతాన్ని మర్చిపోవద్దు!: బోండా ఉమ ఫైర్
- బీజేపీ ప్రధాని అభ్యర్థిగా అన్ని రాష్ట్రాలకు వెళ్లి, అందరనీ మోదీ కలిశారు
- మోదీ పాలనకు ఆఖరు ఘడియలు వచ్చేశాయి
- జాతీయ స్థాయిలో టీడీపీ చక్రం తిప్పుతుంది
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపై టీడీపే నేత బోండా ఉమ మండిపడ్డారు. ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందని తాము ఎప్పుడూ చెప్పలేదని ఆయన అన్నారు. తెలంగాణ రాజకీయం వేరు, ఏపీ రాజకీయం వేరని చెప్పారు. అఖిలేష్ పిలిస్తే చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారన్న జీవీఎల్ వ్యాఖ్యలను ఉమ తప్పుబట్టారు.
అఖిలేష్ యాదవ్ మాజీ ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. గత ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఉన్న మోదీ... ఎమ్మెల్యేలు కాని వారిని కూడా పిలిపించుకుని మాట్లాడారని చెప్పారు. అన్ని రాష్ట్రాలకు వెళ్లి, అందరినీ కలిసి వచ్చారని తెలిపారు. గతాన్ని జీవీఎల్ మర్చిపోరాదని సూచించారు.
ఓటమి భయంతోనే బీజేపీ నేతలు నోరు పారేసుకుంటున్నారని ఉమ ఎద్దేవా చేశారు. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి అవసరమని... ఈ నేపథ్యంలోనే భావసారూప్యత ఉన్న అన్ని పార్టీలతో మాట్లాడుతున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలోని కీలక వ్యవస్థలను నాశనం చేస్తున్న బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని అన్నారు. మోదీ పాలనకు ఆఖరు ఘడియలు వచ్చేశాయని, జాతీయ స్థాయిలో టీడీపీ కీలక పాత్ర పోషించబోతోందని చెప్పారు.