Pavan kalyan: రేపు విజయవాడ నుంచి తునికి.. పవన్ కల్యాణ్ రైలు ప్రయాణం!
- జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం
- ప్రయాణంలో పార్టీ ఆశయాల వెల్లడి
- హాజరుకానున్న జనసేన కార్యకర్తలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు రైలు యాత్ర చేయనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ రైలు యాత్రకు సంబంధించిన విధివిధానాలను తెలియజేస్తూ ఒక లేఖను ట్విట్టర్లో విడుదల చేసింది. ఆయన ప్రయాణం విజయవాడ నుంచి తునికి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో సాగుతుంది. ప్రయాణంలో ప్రజా సమస్యలు, పార్టీ ఆశయాలను ప్రజలకు జనసేనాని వివరిస్తారు.
‘‘రేపు పవన్ కల్యాణ్ గారు విజయవాడ నుండి తునికి రైలులో ప్రయాణం చేయనున్నారు. దీనికి వివిధ రైల్వే స్టేషన్లలో భారీ ఎత్తున జనసేన కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికి యాత్ర విజయవంతమవ్వాలని శుభాకాంక్షలు తెలపనున్నారు. ఈ క్రమంలో రైల్వే స్టేషన్లోకి ప్రవేశించే ప్రతి జనసేన కార్యకర్త ఫ్లాట్‌ఫారం టికెట్ కొని వాటిని బ్యాడ్జీలుగా ధరించి, ప్రతి ఒక్కరం చట్టబద్ధంగా ప్లాట్‌ఫారంపైకి ప్రవేశించామని తెలియజేస్తూ.. చ---ట్టాలని, నియమాలను గౌరవించే బాధ్యత గల పౌరులమని నిరూపిద్దాం.
ఈ సందర్భంగా చట్టాలను అతిక్రమించి ఫ్లాట్‌ఫారం టికెట్ కొనకుండా ప్రవేశించారని కథనాలు ప్రసారం చేసే అవకాశం మీడియా మిత్రులకు ఇవ్వకూడదని విన్నపం. దేశంలో ఇంతవరకూ ఏ రాజకీయ పార్టీ పాటించని ఈ క్రమశిక్షణ విధానాన్ని జనసేన పార్టీ తరుఫున మనం ప్రవేశపెడదాం. జనసేన మిత్రులందరూ ఈ అంశాన్ని పాటించగలరని మనవి’ అంటూ పాటించవలసిన సూచనలతో మరో లేఖను ట్విట్టర్లో జనసేన పోస్ట్ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 1.20 నిమిషాలకు విజయవాడలో పవన్ జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరతారు. సాయంత్రం 5.20 నిమిషాలకు తుని రైల్వే స్టేషన్లో దిగుతారు.