Team India: టీమిండియా మెనూ నుంచి బీఫ్‌ను తొలగించండి.. క్రికెట్ ఆస్ట్రేలియాను కోరిన బీసీసీఐ
- ఈ నెల 21 నుంచి ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భారత జట్టు
- ఇంగ్లండ్ పర్యటనలో విమర్శలు ఎదుర్కొన్న బీసీసీఐ
- శాకాహార వంటకాలు, పండ్లు ఉంచాలని విజ్ఞప్తి
విండీస్‌తో టీ20 సిరీస్ ముగిశాక భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో రెండు వారాల క్రితం బీసీసీఐకి చెందిన ఇద్దరు సభ్యుల బృందం ఆస్ట్రేలియాలో పర్యటించింది. ఈ సందర్భంగా టీమిండియా మెనూలో బీఫ్ ఉండడాన్ని చూసిన అధికారులు కంగుతిన్నారు. ఆ మెనూలోంచి బీఫ్‌ను తొలగించాలని సూచించారు. ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టుకు అందించిన లంచ్‌లో ‘బ్రెయిస్డ్ బీఫ్ పాస్తా’ను సర్వ్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ముందుగానే అప్రమత్తమైన బీసీసీఐ ఆస్ట్రేలియా పర్యటనలో అందుకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. అందులో భాగంగానే టీమిండియా మెనూ నుంచి బీఫ్‌ను తొలగించాలని కోరింది.
బీఫ్‌ను తొలగించి పూర్తి శాకాహార వంటకాలతోపాటు పండ్లను కూడా మెనూలో చేర్చాలని సూచించింది. కాగా, ఇటీవల బీసీసీఐ పాలకమండలి (సీవోఏ)తో జరిగిన సమావేశంలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కొన్ని డిమాండ్లు ఉంచిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచకప్ నేపథ్యంలో రిజర్వ్డ్ రైలు కోచ్, అరటిపండ్లును ఉంచడంతోపాటు టూర్ మొత్తం భార్యలను అనుమతించాలని కోరాడు. కోహ్లీ విజ్ఞప్తిపై సీవోఏ సానుకూలంగా స్పందించింది. కాగా, ఈనెల 21 నుంచి జనవరి 18 వరకు భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది.