Chandrababu: చంద్రబాబు చెప్పిందే చెబుతున్నా... నాకేం తెలియదు: కేటీఆర్
- బాబు, రాహుల్ భేటీపై తనదైన శైలిలో స్పందన
- ఆయన వ్యాఖ్యలనే ప్రతిధ్వనింపజేస్తానన్న కేటీఆర్
- చంద్రబాబు పాత ట్వీట్లను గుర్తు చేస్తూ ట్వీట్
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిన్న న్యూఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ తో కలసి పనిచేయాలని తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ రాష్ట్ర సమితి యువనేత కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెడుతూ, "చంద్రబాబునాయుడి మాటలను ప్రతిధ్వనింపచేయడమే తప్ప మరేమీ కామెంట్ చేయబోను" అని అంటూ గతంలో చంద్రబాబు చేసిన కొన్ని ట్వీట్ల స్క్రీన్ షాట్లను ఆయన పోస్టు చేశారు. గతంలో చంద్రబాబు "అవినీతి కాంగ్రెస్ నుంచి దేశానికి స్వాతంత్ర్యం తేవడమే నా లక్ష్యం. అందుకోసం ఏమైనా చేస్తాను" అని చెప్పిన ట్వీట్లను జత చేశారు.
వీటితో పాటు "రాహుల్ ను ప్రధానిగా చేయాలన్న సోనియా గాంధీ, వ్యక్తిగత ఎజెండాతో దేశ భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నారు" అని, "ఏపీ కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ కాళ్లపై పడిపోయారు. ఇప్పుడు 1983 రిపీట్ అవుతుంది. కాంగ్రెస్ తుడిచిపెట్టుకు పోతుంది" అని, "అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ ను ప్రజలు వ్యతిరేకించారు. ఎన్డీయేకు ఓటిసిన వారందరికీ ధన్యవాదాలు" అని చేసిన ట్వీట్లను పోస్టు చేశారు. కేటీఆర్ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.