Facebook: విమానంలో ఫేస్ బుక్ ఉద్యోగిని ఇబ్బంది పెట్టిన సిబ్బంది... దిగేసరికి క్షమాపణలు, టికెట్ ఫుల్ రిఫండ్!
- బిజినెస్ క్లాస్ లో ప్రయాణించిన కృపా పటేల్
- బిడ్డ ఏడుస్తుంటే సహించని విమాన సిబ్బంది
- విమానం నుంచే ఫేస్ బుక్ లో పోస్టు
- వైరల్ కావడంతో దిగివచ్చిన యాజమాన్యం
తమ ఎనిమిది నెలల బిడ్డతో కలిసి, బిజినెస్ క్లాస్ లో సిడ్నీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో బయలుదేరిన ఓ జంటకు విమానంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. విమానంలోని ఆన్ బోర్డ్ ఇంటర్నెట్ సాయంతో, తాను పడుతున్న ఇబ్బందిని చెబుతూ, సిబ్బంది వైఖరిని ప్రశ్నిస్తూ, ఆ తల్లి ఓ పోస్టు పెట్టగా, దానిపై విపరీతమైన స్పందన వచ్చింది. విమానం శాన్ ఫ్రాన్సిస్కో చేరే సమయానికి ఎయిర్ లైన్స్ సిబ్బంది క్షమాపణల పత్రం, పూర్తి టికెట్ రిఫండ్ తో సిద్ధంగా నిలిచారు.
మరిన్ని వివరాల్లోకి వెళితే... యునైటెడ్ ఎయిర్ లైన్స్ లో తన భర్త, బిడ్డతో శాన్ ఫ్రాన్సిస్కో బయలుదేరిన ఫేస్ బుక్ ఉద్యోగిని కృపా పటేల్ బాలా, బిజినెస్ క్లాస్ లో ప్రయాణించారు. ఆమెకు ఎనిమిది నెలల బిడ్డ ఉండగా, విమానం బయలుదేరిన కాసేపటికే బిడ్డ ఏడుపు లంఘించుకున్నాడు. దీంతో ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని, బిడ్డ ఏడవటాన్ని తాము అంగీకరించబోమని సిబ్బంది తెగేసి చెప్పారు. విమానంలో ఐదు నిమిషాలకు మించి బిడ్డలు ఏడవ కూడదన్న రూల్ ఉందని విసుక్కున్నారు. కృపా పటేల్ ఎంతగా సముదాయించినా, చాలా సేపటి వరకూ బిడ్డ ఏడుపు ఆపలేదు. దీంతో సిబ్బంది ఆమెపై నానాయాగీ చేశారు.
తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె, విమానంలో నుంచే, ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. ఆమె పోస్టు వేలకొద్దీ షేర్లను తెచ్చుకోవడంతో, యునైటెడ్ ఎయిర్ లైన్స్ యాజమాన్యం స్పందించింది. విమానం నుంచి ఆమె దిగేసరికి ఎయిర్ లైన్స్ ఉన్నతాధికారులు, ఆ దంపతులకు క్షమాపణలు చెబుతూ, ప్రయాణం నిమిత్తం వారు చెల్లించిన పూర్తి డబ్బును వెనక్కు ఇస్తామని ఆఫర్ చేశారు. కృపా పటేల్ మాదిరిగానే తాము విమానంలో చిన్నారులతో ఎన్నో ఇబ్బందులు పడ్డామని పలువురు తమ అనుభవాలను వెల్లడిస్తున్నారు.