Andhra Pradesh: 'ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలుస్తా.. ఎమ్మెల్యేలను తీసుకొస్తా' అంటూ గతంలో చంద్రబాబు వైఎస్ దగ్గరకు వచ్చారు!: కన్నా తీవ్ర ఆరోపణలు
- ఎన్టీఆర్ పైనే పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికారు
- ఆయన ప్రభుత్వాన్ని చివరికి కూల్చేశారు
- ఇప్పుడు ఎన్టీఆర్ ఫొటోకు రోజూ దండలు వేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు లాంటి అవకాశవాద నాయకుడు దేశంలో మరొకరు లేరని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో ఉండగా మామ ఎన్టీఆర్ పైనే పోటీ చేస్తానని సవాలు విసిరిన బాబు ఎన్నికల్లో ఓడిపోయాక కాళ్లు పట్టుకుని ఆయన పంచన చేరారని దుయ్యబట్టారు. కర్షక పరిషత్ వ్యవహారంలో కోర్టు మొట్టికాయలు వేసినా ఆయన మారలేదని ఎద్దేవా చేశారు. ఈరోజు విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎన్టీఆర్ టీడీపీని చీలుస్తాననీ, సాయం చేయాలని అప్పట్లో చంద్రబాబు వైఎస్ రాజశేఖరరెడ్డిని కోరారనీ, అయితే దాన్ని సున్నితంగా వైఎస్ తిరస్కరించారని కన్నా వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఓ జాతీయ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైఎస్ బయటపెట్టారని వెల్లడించారు. ప్రజల నిర్ణయాన్ని గౌరవించాలని, కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారని వైఎస్ చెప్పినట్లు కన్నా గుర్తుచేసుకున్నారు. ఈ కుట్ర 1996లో వైస్రాయ్ ఘటనతో పూర్తయిందన్నారు. ఎన్టీఆర్ ను చంపేశాక ఇప్పుడు చంద్రబాబు ఆయనకు రోజూ దండ వేస్తున్నారని విమర్శించారు. ప్రతీ ఎన్నికలకు కొత్త భాగస్వామిని ఎన్నుకోవడం చంద్రబాబు నైజమని ఎద్దేవా చేశారు.
2019లో మోదీని ప్రధాని చేసేవరకూ నిద్రపోనని చంద్రబాబు ఎన్డీయే కూటమిలో తీర్మానం పెట్టారని గుర్తుచేశారు. సోనియా ఇటలీ దయ్యం, ఆమెను తరిమేయాలి, కాంగ్రెస్ వల్లే దేశం నాశనమైంది అంటూ బాబు చెప్పారన్నారు. ఇలా చొక్కాలు మార్చినట్లు మాటలు మార్చడంలో చంద్రబాబు ఉద్ధండుడని దుయ్యబట్టారు.