vanteru: వంటేరు నాపై చేసిన ఆరోపణలకు ఆధారాలుంటే బయటపెట్టాలి: మంత్రి హరీశ్ రావు
- ఈ ఆరోపణలను ఖండిస్తున్నా
- ఏ ఎండకు ఆ గొడుగు పట్టే అవకాశవాది ప్రతాప్ రెడ్డి
- గోబెల్స్ ప్రచారాలతో రాజకీయాలు నడవవు
గజ్వేల్ లో కేసీఆర్ ను ఓడించమని మంత్రి హరీశ్ రావు తనకు ఫోన్ చేశారంటూ కాంగ్రెస్ పార్టీ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి చేసిన ఆరోపణలు సంచలనం రేకెత్తించాయి. ఈ నేపథ్యంలో హరీశ్ రావు స్పందించారు. గజ్వేల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఆరోపణలను ఖండిస్తున్నట్టు చెప్పారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలుంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే అవకాశవాది ప్రతాప్ రెడ్డి అని నిప్పులు చెరిగారు. గోబెల్స్ ప్రచారాలతో రాజకీయాలు నడవవని, అసహనంతో గిమ్మిక్కులకు పాల్పడుతున్నారని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గజ్వేల్ ప్రజలకు ప్రతాప్ రెడ్డి సంగతి తెలిసిపోయిందని, ఆయన డిపాజిట్లు గల్లంతయ్యే వరకూ తాను గజ్వేల్ లోనే ఉంటానని అన్నారు. వంటేరు ప్రతాప్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలను ఖండిస్తున్నానని, తక్షణమే ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తన పుట్టుక, చావు టీఆర్ఎస్ లోనే అని, బతికినంత కాలం తన జీవితం కేసీఆర్ కే అంకితమని స్పష్టం చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ది ముగిసిన అధ్యాయమని, త్వరలో జరగబోయే ఎన్నికల్లో వంద సీట్లు సాధించి తాము అధికారంలోకి రావడం ఖాయమని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని, రాహుల్ గాంధీ ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ ఓటమి తప్పదని అభిప్రాయపడ్డారు.