Deewali: భారీగా పెరిగిన ధరలు... తగ్గిన టపాసుల విక్రయాలు!
- వెలవెలబోతున్న దుకాణాలు
- సాధారణ ధరకు జీఎస్టీ అదనం
- 20 శాతం మేరకు పెరిగిన ధరలు
దీపావళి సీజన్ లో కళకళలాడుతుండే టపాకాయల విక్రయ దుకాణాలు వెలవెలబోతున్నాయి. సాధారణ ధరకు, జీఎస్టీ కూడా అదనం కావడంతో, ప్రతియేటా 10 నుంచి 12 శాతం మేరకు పెరిగే ధరలు, ఈ సంవత్సరం 20 శాతానికి పైగా పెరగడమే ఇందుకు కారణం.
ఇదే సమయంలో సుప్రీంకోర్టు ఆంక్షలు కూడా ఉండటంతో వ్యాపారం తక్కువగా సాగుతోంది. ఈ సంవత్సరం ఎన్నడూ లేనంత అధిక ధరలకు టపాకాయలను విక్రయించాల్సి వస్తోందని వ్యాపారులే అంటున్నారు. లక్షల రూపాయలు పెట్టి, సరుకు తెచ్చుకున్నామని, వాటిని కొనుగోలు చేసే వారు కనిపించడం లేదని వాపోతున్నారు.
కాగా, ఈ సంవత్సరం శబ్దాలు లేకుండా, అలరించేలా సరికొత్త ఫ్యాన్సీ వెరైటీలు ఓ పది రకాల వరకూ మార్కెట్లోకి వచ్చాయి. గాల్లోకి వెళ్లిన తరువాత గొడుగు ఆకారం, కుర్చీ ఆకారాల్లోకి వచ్చే తారాజువ్వలను రూ. 400 ధరకు విక్రయిస్తున్నారు. ఫ్యాన్సీ ఐటమ్స్ ధరలు ఎక్కువగా కనిపిస్తున్నా, టపాకాయలు కొనుగోలు చేసే వారిలో అత్యధికులు వాటిని కొనుగోలు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. ఇక తక్కువ కాలుష్యాన్ని వెదజల్లే వెరైటీలకు కూడా గిరాకీ బాగానే కనిపిస్తోంది.