umabharathi: రామాలయం పక్కన మసీదు నిర్మాణంపై మాట్లాడడం అసమంజసం : కేంద్ర మంత్రి ఉమాభారతి
- అయోధ్యలోనే రాముడు జన్మించాడన్నది నిర్వివాదాంశం
- ఇది స్థల వివాదమేగాని, విశ్వాసాలకు సంబంధించిన తగాదా కాదు
- న్యాయస్థానం వెలుపల దీనికి పరిష్కారం కనుక్కోవాలి
అయోధ్యలో మసీదు నిర్మించాలన్నది అర్థంలేని అసమంజసమైన వాదన అని కేంద్ర మంత్రి ఉమాభారతి అన్నారు. ‘ముస్లింలు పవిత్రంగా భావించే మదీనాలో ఆలయం ఉందా, క్రైస్తవుల పవిత్ర స్థలం వాటికన్ సిటీలో మసీదు ఉందా?’ అని మంత్రి ప్రశ్నించారు. నిన్న ఓ వార్తా సంస్థతో మాట్లాడిన ఉమాభారతి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అయోధ్య అంశం స్థల వివాదమే తప్ప విశ్వాసాలకు సంబంధించిన తగాదా కాదని స్పష్టం చేశారు. శ్రీరాముడు అయోధ్యలోనే పుట్టాడన్నది తిరుగులేని వాస్తవమని, అటువంటప్పుడు వివాదానికి న్యాయస్థానం బయట పరిష్కారం కనుక్కోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. శ్రీరాముడు జన్మించిన అయోధ్యలోని రామాలయం చుట్టూ మసీదు కడతారనే చర్చే హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందన్నారు. ప్రపంచంలోనే అత్యంత సహన శీలురుగా గుర్తింపు పొందిన హిందువులను అసహనానికి గురిచేస్తుందని అన్నారు.
జాతి ప్రయోజనాలతో ముడిపడి వున్న ఈ అంశానికి రాహుల్‌గాంధీ, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వంటి నేతలతో సహా రాజకీయ ప్రముఖులంతా మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఢిల్లీలో జరిగిన రెండు రోజుల సదస్సు అనంతరం అయోధ్యలో రామాలయం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని అఖిల భారతీయ సంత్ సమితి విజ్ఞప్తి చేసింది.