Gujarat: గుజరాత్ సచివాలయంలోకి ప్రవేశించిన చిరుతపులి!
- నేటి తెల్లవారుజామున ఘటన
- గోట్ల మధ్య ఖాళీ నుంచి ప్రవేశించిన చిరుత
- వేట మొదలు పెట్టిన అటవీ అధికారులు
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో కొత్తగా నిర్మించిన సచివాలయం భవనం, ముఖ్యమంత్రి కార్యాలయం పరిసరాల్లోకి ఓ చిరుతపులి ప్రవేశించడం తీవ్ర కలకలం రేపింది. సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ చిరుత తిరిగి వెళ్లినట్టు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. గేట్ల మధ్య ఉన్న ఖాళీ ద్వారా ఇది ప్రవేశించగా, విషయాన్ని పసిగట్టిన భద్రతా సిబ్బంది వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఆ వెంటనే రంగ ప్రవేశం చేసిన అధికారులు, ఉదయం నుంచి చిరుత జాడ కోసం వెతుకులాట ప్రారంభించారు. సమీపంలోని ఇంద్రోదా పార్క్ నుంచి ఈ చిరుత పులి ప్రవేశించి వుండవచ్చని అధికారులు భావిస్తున్నారు. కాగా, నగరంలోకి వన్యప్రాణులు ప్రవేశించడం ఇదే తొలిసారేమీ కాదు. గతంలో సబర్మతీ నది సమీపంలోకి ఓ చిరుత రాగా, అధికారులు శ్రమించి, దాన్ని పట్టుకున్నారు.
ఇక తాజా ఘటనలో చిరుత మళ్లీ వస్తే పట్టుకునేందుకు బోనులను ఏర్పాటు చేశామని, ఇది ఎటు వెళ్లిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఇది బయటకు వెళ్లినట్టు ఎక్కడా నిర్ధారించలేకపోతున్న అధికారులు, ఇది ఇంకా సచివాలయం క్యాంపస్ లోనే ఉండి వుండవచ్చని అంచనా వేస్తున్నారు.