Allahabad: మీ పేరు రావణ, దుర్యోధన అని లేదేం?: యోగి ఆదిత్యనాథ్ పోలిక
- అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్ గా మార్చిన యూపీ సర్కారు
- వెల్లువెత్తుతున్న విమర్శలపై స్పందించిన సీఎం యోగి
- ఎవరైనా మంచి పేర్లే పెట్టుకుంటారని వెల్లడి
అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్ గా మార్చడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, తనదైన శైలిలో స్పందించారు. పురాణాల్లో విలన్లతో పోలుస్తూ, మీ తల్లిదండ్రులు మీకు రావణ, దుర్యోధన అన్న పేర్లు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. హరిద్వార్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, అలహాబాద్ పేరును ఎందుకు మార్చారని కొందరు చేస్తున్న విమర్శలను ప్రస్తావించారు.
ఎవరైనా మంచి పేర్లను మాత్రమే పెడతారని, తాను కూడా అదే పని చేశానని అన్నారు. ఇండియాలోని ఎన్నో పేర్లు రాముడితో సంబంధాన్ని కలిగివుంటాయని యోగి చెప్పారు. రాముడి పాలన అద్భుతంగా సాగినందునే భారత సంస్కృతితో ఆయన పేరు చిరస్థాయిగా కలిసి పోయిందని చెప్పారు. కాగా, అక్టోబర్ 16న అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్ గా మారుస్తూ, యోగి సర్యారు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
వాస్తవానికి అలహాబాద్ అసలు పేరు ప్రయాగ్. 1575లో మొగల్ చక్రవర్తి అక్బర్, ఈ ప్రాంతాన్ని సందర్శించి, గంగా, యమునల సంగమ ప్రాంతంలో ఓ కోటను కట్టించి, దానికి సంగమ్ అన్న పేరు పెట్టారు. ప్రయాగ్, సంగమ్ ప్రాంతాలను కలుపుతూ ఇలహాబాద్ గా ఆయన నామకరణం చేయగా, ఆయన మనవడు షాజహాన్, ఈ పేరును అలహాబాద్ గా మార్చారని చరిత్ర చెబుతోంది. నాడు అక్బర్ చేసిన తప్పిదాన్ని నేడు బీజేపీ సరిచేసిందని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.