V.Hanumantha Rao: వారిది ఈస్ట్ ఇండియా కంపెనీ అయితే, అసదుద్దీన్‌ది కల్వకుంట్ల కంపెనీయా?: వీహెచ్
- అసదుద్దీన్ వ్యాఖ్యలపై వీహెచ్ ఆగ్రహం
- బీసీలకే ఎక్కువ సీట్లు కేటాయించాలి
- ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నారు
కేసీఆర్‌కు అసదుద్దీన్ మద్దతిస్తున్నారని.. ఎందుకు ఇస్తున్నారో కూడా అర్థం కావడం లేదని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంఐఎం నేత అసదుద్దీన్ వ్యాఖ్యలపై వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ, రాహుల్ గాంధీ, చంద్రబాబులను కలిపి ఈస్ట్ ఇండియా కంపెనీ అంటూ అసదుద్దీన్ వ్యాఖ్యానించడంపై స్పందించిన వీహెచ్.. వారిది ఈస్ట్ ఇండియా కంపెనీ అయితే ఆయనది కల్వకుంట్ల కంపెనీయా? లేదంటే కేసీఆర్‌కు అసదుద్దీన్ ఏమైనా స్లీపింగ్ పార్ట్‌నరా? అని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో 54 శాతం బీసీలు ఉన్నందున వారికి రాజకీయ పార్టీలు ఎక్కువ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. మహాకూటమిలో కూడా బీసీలకే ఎక్కువ సీట్లు ఇవ్వాలని కోరుతున్నట్టు తెలిపారు. కేసీఆర్ చేసిన మోసాలను గ్రహించిన ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నారని వీహెచ్ తెలిపారు.