Sabarimala: ప్రశాంతంగా శబరిమల అయ్యప్ప దేవాలయం!
- పోలీసు బందోబస్తు తొలగింపు
- వెనుదిరిగిన భక్తులు
- నిన్న రాత్రి మూతపడ్డ ఆలయం
గడచిన రెండు రోజులుగా వినిపించిన పోలీసుల ఆంక్షలు ఇప్పుడు అక్కడ లేవు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తాము అమలు చేస్తామని చెబుతూ, మహిళలు ఎవరైనా రావచ్చని, వారికి భద్రత కల్పిస్తామని, పోలీసులు స్పష్టం చేయగా, శబరిమలలోని అయ్యప్ప ఆలయాన్ని సందర్శించేందుకు 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న ఏ మహిళా రాలేదు. సోమవారం సాయంత్రం 5.30 గంటలకు ప్రత్యేక పూజల నిమిత్తం తెరచుకున్న అయ్యప్ప ఆలయం మంగళవారం రాత్రి తిరిగి మూసుకుంది. ఈ 30 గంటల వ్యవధిలో ఆలయ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
శబరిమల చరిత్రలో తొలిసారిగా, 50 సంవత్సరాల వయసు పైబడిన మహిళా పోలీసులను భద్రతకు నియమించింది కేరళ సర్కారు. నీలక్కల్, పంబ నుంచి సన్నిధానం వరకూ దాదాపు 2,300 మంది పోలీసులను నియమించారంటే, అక్కడ నెలకొన్న తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా మహిళలను అనుమతించేది లేదని భక్తులు స్పష్టం చేస్తుండటం, కోర్టు ఆదేశాలను పాటించాల్సిందేనని ప్రభుత్వం కరాఖండీగా చెప్పడంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది.
ఆలయం తలుపులు గత రాత్రి 10 గంటల తరువాత మూసివేయడంతో, అప్పటివరకూ అక్కడ ఉన్న భక్తులు వెనుదిరిగారు. పోలీసు బందోబస్తునూ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీంతో ప్రస్తుతం శబరిమల ప్రశాంతంగా ఉంది. ఆలయం తలుపులు ఈ నెల మూడోవారంలో మండల పూజ నిమిత్తం తెరచుకోనున్న సంగతి తెలిసిందే. అప్పుడు 40 రోజులకు పైగా ఆలయం తెరవనుండటంతో ఆ సమయంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది.