Kartika Masam: మొదలైన కార్తీక శోభ... అయ్యప్ప మాలలేసుకున్న లక్షలాది మంది... ఆలయాలు కిటకిట!
- నేటి నుంచి కార్తీకమాసం
- భక్తులతో నిండిపోయిన ఆలయాలు
- పరమ శివునికి ప్రత్యేక పూజలు
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ మొదలైంది. నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభం కావడంతో, కోస్తాంధ్రలోని సముద్ర తీరంతో పాటు కృష్ణా, గోదావరి నదుల్లో తెల్లవారుజామునే స్నానాలు చేసేందుకు ప్రజలు బారులు తీరారు. ఈ ఉదయం అన్ని శివాలయాలతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ భక్తులతో నిండిపోయాయి. నేడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో లక్షలాది మంది అయ్యప్ప మాలలు ధరించేందుకు ఆలయాలకు పోటెత్తారు.
శ్రీకాళహస్తి, వేములవాడ, విజయవాడ కనకదుర్గమ్మ, భీమవరం సహా పంచారామాలు భక్తులతో నిండిపోయాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రానికి భక్తులు వెల్లువలా తరలివచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని సోమేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది.