Harish Rao: నిప్పుల్లో నడిచినా హరీశ్ తన శీలాన్ని నిరూపించుకోలేరు: రేవంత్
- హరీశ్ జాతకమంతా కేసీఆర్‌కు తెలుసు
- నర్సారెడ్డితో హరీశ్ చర్చలు జరిపారు
- 25న ఏం జరిగిందో హరీశ్ వెల్లడించాలి
మంత్రి హరీశ్ రావు జాతకమంతా ఆయన మామ కేసీఆర్ వద్ద ఉందని, హరీశ్ ఎలాంటి వ్యక్తో.. నమ్మినవాళ్లను ఎలా మోసం చేశారో అంతా కేసీఆర్‌కు తెలుసని కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ సీట్ల కేటాయింపుపై కసరత్తు జరుగుతున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హరీశ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. హరీశ్ నిప్పుల్లో నడిచినా తన శీలాన్ని నిరూపించుకోలేరన్నారు. మంత్రుల క్వార్టర్స్ వద్ద ఉన్న సీసీ టీవీ ఫుటేజీలన్నీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
గత నెల 25 సాయంత్రం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గజ్వేల్‌లో నర్సారెడ్డిని కారులో ఎక్కించుకొని రాత్రి 9.30గంటలకు హరీశ్ క్వార్టర్స్‌కు తీసుకెళ్లారు. ఆ రోజు రాత్రి హరీశ్‌తో మూడు గంటల పాటు చర్చలు జరిగాయని.. తెల్లవారే వెళ్లి నర్సారెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని.. దీని వెనుక కారణమేంటో వారికే తెలియాలన్నారు.
25న సాయంత్రం 7గంటల నుంచి 9 గంటల వరకు హరీశ్‌రావు నివాసంలోకి వచ్చి, వెళ్లిన కార్లు.. వాటిలో ఎవరెవరు ఉన్నారో వెల్లడిస్తే కేసీఆర్, కేటీఆర్‌తో పాటు ప్రతి ఒక్కరికీ స్పష్టత వస్తుందన్నారు. హరీశ్, కేసీఆర్‌ల మధ్య సంబంధాలు తుపాను ముందు ప్రశాంతతా? లేదంటే ఉప్పు, నిప్పులా ఉన్నాయా? అదీకాదంటే విచ్ఛిన్నమయ్యే ముందు నిశ్శబ్దమో ప్రజలకు తెలియాలని రేవంత్ అన్నారు.