Kodandaram: కోదండరాం ముందు రెండు ఆప్షన్లు.. జనగామనే ఎంచుకున్న టీజేఎస్ చీఫ్!
- కోదండరాం ముందు రామగుండం, జనగామ స్థానాలు
- జనగామను జిల్లా చేయాలంటూ ఉద్యమంలో పాల్గొన్న కోదండరాం
- అన్నీ బేరీజు వేసుకునే ఇక్కడి నుంచి బరిలోకి
తెలంగాణ జన సమితి (టీజేఎస్) చీఫ్ కోదండరాం జనగామ నుంచి బరిలోకి దిగడం ఖాయమైంది. ఆయన ఎక్కడి నుంచి బరిలోకి దిగుతానంటే ఆ స్థానాన్ని కేటాయించాలని కాంగ్రెస్ భావించింది. రామగుండం లేదంటే జనగామ నుంచి పోటీ చేయాలని కోదండరాం భావిస్తుండడంతో ఏ స్థానాన్ని ఎంచుకుంటారో తేల్చుకోవాలని కాంగ్రెస్ కోరింది. అయితే, కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని యోచిస్తుండడంతో ఆ స్థానాన్ని కాంగ్రెస్‌కే వదిలేయాలని టీపీసీసీ నేతలు ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. అయితే, ఏఐసీసీ జోక్యంతో కాంగ్రెస్ నేతలు వెనక్కి తగ్గారు.
జనగామను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలన్న ఉద్యమంలో కోదండరాం చురుగ్గా పాల్గొన్నారు. అంతేకాక, జనగామలో కోదండరాం బంధువులు చాలామంది ఉండడంతో కోదండరాం ఈ స్థానాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ స్థానం నుంచి పోటీ చేస్తే గెలుపు సులభం అవుతుందన్న ఉద్దేశంతోనే ఆయనీ స్థానాన్ని ఎంచుకున్నట్టు సమాచారం. దీనికి తోడు, టీజేఎస్ చేయించుకున్న సర్వేల్లో కూడా జనగామలో టీజేఎస్‌కు ఆదరణ ఉందని తేలింది. ఈ కారణంగానే కోదండరాం ఈ స్థానం నుంచి పోటీ పడుతున్నట్టు చెబుతున్నారు.