Telangana: తెలంగాణలో మహాకూటమిదే విజయం.. చెప్పేసిన ఏబీపీ-సి ఓటర్ సర్వే
- 64 స్థానాల్లో విజయం సాధించనున్న మహాకూటమి
- 42 స్థానాలకే పరిమితం కానున్న టీఆర్ఎస్
- టీడీపీతో పొత్తుతో బలపడిన కాంగ్రెస్
తెలంగాణలో మహాకూటమి గెలుపు ఖాయమని ఏబీపీ-సి ఓటర్ సర్వే తేల్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవడం మహాకూటమికి కలిసి వచ్చిందని సర్వే అభిప్రాయపడింది. విజయంపై ఆశలు పెట్టుకున్న కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి ఈసారి పరాజయం తప్పదని పేర్కొంది.
సెప్టెంబరులో మహాకూటమికి రూపుదిద్దుకుంది. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐతో ప్రారంభమైన కూటమిలో ఆ తర్వాత తెలంగాణ జనసమితి(టీజేఎస్) కూడా వచ్చి చేరింది. వీటి కలయికతో అప్పటి వరకు ఉన్న పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయని సర్వే పేర్కొంది. కూటమి ఏర్పడడానికి ముందు విజయంపై కేసీఆర్ ధీమాగా ఉన్నారని, కానీ ఇప్పుడాయనలో ఆ ధీమా కనిపించడం లేదని సర్వే పేర్కొంది. ఏబీపీ న్యూస్, రిపబ్లిక్ టీవీ కోసం నిర్వహించిన ఈ సర్వేలో కాంగ్రెస్-టీడీపీ కూటమి 64 స్థానాల్లో విజయం సాధిస్తుందని, టీఆర్ఎస్ 42 స్థానాలకే పరిమితమవుతుందని తేలింది. బీజేపీ 4, ఇతరులు 9 స్థానాల్లో విజయం సాధిస్తారని పేర్కొంది.
గత ఎన్నికలతో పోలిస్తే టీఆర్ఎస్ ఓట్ల శాతం గణనీయంగా పడిపోతుందని సర్వేలో వెల్లడైంది. మహాకూటమికి 33.9 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉండగా, టీఆర్ఎస్‌కు 29.4 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. అయితే, సర్వేలో పాల్గొన్న వారిలో 42.9 శాతం మంది కేసీఆరే మళ్లీ సీఎం కావాలని కోరుకోవడం గమనార్హం. ఆ తర్వాతి స్థానాల్లో జానారెడ్డి ఉన్నారు. ఆయన సీఎం కావాలని 22.6 శాతం మంది కోరుకున్నారు.