Telangana: కేసీఆర్ నామినేషన్‌కు ముహూర్తం.. 14న గజ్వేల్‌లో నామినేషన్ వేయనున్న టీఆర్ఎస్ అధినేత
- బుధవారం కార్తీక శుద్ధ సప్తమి కావడంతో నామినేషన్
- అంతకుముందు కోనాయిపల్లి దేవాలయంలో పూజలు
- సాయంత్రం సంగాపూర్‌లో భారీ బహిరంగ సభ
తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నామినేషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు. 14న ఆయన గజ్వేల్‌లో నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ఆ పార్టీ నేత హరీశ్ రావు తెలిపారు. 14న కార్తీక శుద్ధ సప్తమి కావడంతోనే ఆ రోజును ఎంచుకున్నట్టు తెలుస్తోంది. బుధవారం ఉదయం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కేసీఆర్ అక్కడే నామినేషన్ పత్రాలపై సంతకం చేస్తారు. అనంతరం అక్కడి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి 11:23 గంటలకు గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. అనంతరం అక్కడి నుంచి భారీ బైక్ ర్యాలీ మధ్య సంగాపూర్ రోడ్డులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు చేరుకుని ప్రసంగిస్తారు. తూఫ్రాన్‌లో శుక్రవారం రాత్రి నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో హరీశ్ రావు ఈ విషయాన్ని వెల్లడించారు.
ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించనున్న సమావేశంలో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు కేసీఆర్ బీఫారాలు అందించనున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఇప్పటికే ప్రకటించిన 107 మంది అభ్యర్థలకు ఆహ్వానాలు అందాయి. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ వీరికి బీఫారాలు అందించనున్నారు.