Kerala: శబరిమలలో మరో టెన్షన్.. అయ్యప్ప దర్శనానికి సిద్ధమైన 539 మంది మహిళలు!
- వీరంతా 10-50 ఏళ్లలోపు వారే
- గట్టి భద్రత కల్పిస్తున్న పోలీసులు
- 16న తెరుచుకోనున్న ఆలయం
కేరళలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప ఆలయ వివాదం మరింత ముదురుతోంది. మకర సంక్రాంతి సందర్భంగా వార్షిక వేడుకల్లో స్వామివారిని దర్శించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ 539 మంది మహిళలు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా 10 నుంచి 50 ఏళ్ల లోపు వారు కావడంతో శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
కాగా, ఈ నెల 16న శబరిమల ఆలయం మరోసారి తెరుచుకోనుంది. ఈ నేపథ్యంలో 10-50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఆలయంలోకి ప్రవేశించకుంండా హిందూ సంస్థలు ఆందోళనకు దిగుతున్నాయి. వార్షిక వేడుకల్లో పాల్గొనేందుకు ఇప్పటివరకూ 3.5 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో 539 మంది మహిళలు ఉన్నారు.
మరోవైపు పరిస్థితి చేయిదాటి పోకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ మార్గంలో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి ముందుకు పంపుతున్నారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు వెళ్లవచ్చిన సుప్రీంకోర్టు సెప్టెంబర్ నెలలో4-1 మెజారిటీతో తీర్పు ఇచ్చింది.