Andhra Pradesh: వైసీపీ గూటికి కాంగ్రెస్ మాజీ నేత సి.రామచంద్రయ్య.. 13న జగన్ సమక్షంలో చేరిక!
- బొబ్బిలి సభలో జగన్ సమక్షంలో చేరిక
- కాంగ్రెస్-టీడీపీ పొత్తును నిరసిస్తూ రాజీనామా
- గతంలో టీడీపీ, పీఆర్పీలో పనిచేసిన నేత
కాంగ్రెస్ పార్టీ మాజీ నేత సి.రామచంద్రయ్య వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. టీడీపీతో కాంగ్రెస్ జతకట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రామచంద్రయ్య కొద్దిరోజుల క్రితం పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. ఈ నెల 13న బొబ్బిలిలో జరగనున్న బహిరంగ సభలో జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరనున్నారు.
కడప జిల్లా రాజంపేటకు చెందిన రామచంద్రయ్య బ్యాంకులో చార్టెట్ అకౌంటెంట్ (సీఏ)గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 1981లో రాజకీయాల్లోకి ప్రవేశించిన రామచంద్రయ్య 1985లో కాంగ్రెస్ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది మంత్రిగా పని చేశారు. ఆయన రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
ఆ తర్వాత కాలక్రమంలో టీడీపీలో చేరిన రామచంద్రయ్యకు చంద్రబాబు పొలిట్ బ్యూరో సభ్యుడి హోదాను కట్టబెట్టారు. తదనంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో ఆయన 2008లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయిన తరువాత ఎమ్మెల్సీగా గెలుపొంది దేవాదాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కాగా, వైసీపీలో చేరితే ఇచ్చే పదవులపై జగన్ ఏం హామీ ఇచ్చారన్న విషయమై రామచంద్రయ్య ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు.